Ukraine: ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొలగాల్సిందే
ఉక్రెయిన్లో ఉద్రికత్తలను రూపుమాపి, యుద్ధానికి శాంతియుత పరిష్కారాన్ని చూపించాలని, బందీలను సత్వరం విడుదల చేయాలని కోరుతూ ఐరాస (United Nations) తీర్మానించింది. తమ భూభాగం నుంచి రష్యా (Russia) సైన్యం వెంటనే వైదొలగాలనే డిమాండుతో ఉక్రెయిన్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా, సర్వప్రతినిధి సభ ఆమోదించింది. వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ఓటింగులో అనుకూలంగా 93, వ్యతిరేకంగా 18 దేశాలు స్పందించాయి. భారత్ (India) సహా 65 దేశాలు ఓటింగుకు దూరంగా ఉన్నాయి. తీర్మానంలో రష్యా దురాక్రమణ అనేది ప్రస్తావించకుండా చూడాలని అమెరికా (America )చేసిన ప్రయత్నాన్ని ఐరాస తిరస్కరించింది. తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా ఉక్రెయిన్పై ఒత్తిడి తెచ్చేందుకు అగ్రరాజ్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు. యుద్ధఖైదీల మార్పిడి, బందీల విడుదల, ఇంధన సదుపాయాలపై దాడుల నిలిపివేత వంటి అంశాలను ఉక్రెయిన్ ఈ తీర్మానంలో ప్రస్తావించింది.






