విదేశీ విద్యార్థుల రాకపై.. బ్రిటన్ వీసా ఆంక్షలు
దేశానికి ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను నియంత్రించాలని బ్రిటన్ భావిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులను తప్పుదారి పట్టించే రిక్రూట్మెంట్ ఏజెంట్లపై నిషేధం విధించాలని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ నిర్ణయించారు. విదేశీ విద్యార్థుల నియంత్రణకోసం గ్రాడ్యుయేట్ రూట్ వీసా స్కీమ్‌ను సవరించాలని నిర్ణయించారు. వచ్చే సంవత్సరం జనవరిలో బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వలసలు పెరిగిపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని బ్రిటన్‌కు అత్యంత నైపుణ్యం, ప్రతిభావంతులైన విద్యార్థులను మాత్రమే తీసుకునేలా వీసా నిబంధనలను సవరించాలని ప్రధాని భావిస్తున్నారు. బ్రిటన్ల ఉన్నత చదువుల కోసం మన దేశం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్డడీ వీసాపై వెళ్తుతున్నారు.
భారత్‌తో సహా పలు దేశాల్లో గ్రాడ్యుయేట్ వీసా స్కీమ్‌లను మార్కెటింగ్ చేసే ఏజెంట్లను రిషి సునాక్ లక్ష్యంగా చేసుకున్నారు. ఇమ్మిగ్రేషన్‌పై కఠిన వైఖరి అలంభించడం ద్వారా దేశానికి వచ్చే విద్యార్థుల సంఖ్యను తగ్గించవచ్చని భావిస్తున్నారు. హోమ్ ఆఫీస్, ఆఫీస్ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ నుంచి త్రైమాసిక మైగ్రేషన్ డేటా విడుదలైన తరువాత కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ రూట్ వీసాలు పొందుతున్న వారిలో ఇండియన్స్ గణనీయ సంఖ్యలో ఉన్నారు. దీనిపై ఆంక్షలు విధిస్తే, దాని ప్రభావం మన దేశ విద్యార్థులపై పడనుంది. ఈ వీసాను 2021 జులైలో ప్రవేశపెట్టారు. దీన్ని పోస్ట్ స్టడీ వీసాగా పరిగణిస్తారు. విద్యార్థుల చదువు పూర్తయిన తరువాత అదనంగా 2 సంవత్సరాల వరకు యూకేలో ఉండేందుకు ఇదీ వీలు కల్పిస్తుంది.
పీహెచ్డీ విద్యార్థులకు మూడు సంవత్సరాల వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. ఇది దుర్వినియోగం అయినట్లు ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవని సంబంధిత అధికారులు తెలిపినట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ సీజన్లో యూకే యూనివర్సిటీల్లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం పడిరదని, రిక్రూట్మెంట్ పడిపోయిందని ఒక అధికారి తెలిపారు.






