Keir Starmer :అవసరమైతే ఉక్రెయిన్‌కు మా బలగాలు : కీర్ స్టార్మర్
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే తమ బలగాలను ఉక్రెయిన్ (Ukraine) కు పంపడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్ (Britain), ఐరోపా, భద్రత దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్నామన్నారు. ఈ విషయంపై బాగా ఆలోచించిన అనంతరం తమ బలగాలను ఉక్రెయిన్‌కు మద్దతుగా పంపాలనుకున్నామని తెలిపారు. ఆ దేశానికి తాము సహాయం చేస్తున్నామంటే దానికి కారణం తమ పౌరులను కూడా రక్షించుకోవాలనే ఉద్దేశం మాత్రమే అని అన్నారు. ఉక్రెయిన్‌కు సహాయం చేయడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. పారిస్ (Paris) వేదికగా జరిగిన ఓ సమావేశంలో యుద్ధం విషయంలో అమెరికా అవలంభిస్తున్న విధానాలపై చర్చించడానికి ఈయూ (యూరోపియన్ యూనియన్) దేశాల నేతలు పాల్గొనడానికి ముందు కీర్ స్మార్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను కలుస్తానని స్టార్మర్ పేర్కొన్నారు.






