యూఏఈ చారిత్రక నిర్ణయం… మహిళలకు
మహిళలకు సంబంధించి కఠిన చట్టాలను అమలు చేసే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఈ మధ్య వారికి కొన్ని సడలింపులు కల్పిస్తోంది. మహిళల హక్కులు, వారి సాధికారత కోసం పలు సంస్కరణలు తీసుకొస్తూ లింగ సమానత్వం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా దేశం గర్భవిచ్ఛిత్తి పై చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అత్యాచారం, అక్రమ సంబంధం వంటి కేసుల్లో అబార్షన్లకు అనుమతించేందుకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం ప్రకారం అత్యాచారం లేదా వివాహేతర సంబంధం వల్ల మహిళలు గర్భం దాల్చితే దాన్ని తొలగించుకునేందుకు అనుమతి లభిస్తుంది. అత్యాచార ఘటనను లేదా అక్రమ సంబంధంతో గర్భం దాల్చిన విషయాన్ని బాధితులు తక్షణమే అధికారులకు చెప్పాలి. దాన్ని నిరూపించే నివేదికను పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి తీసుకురావాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 120 రోజుల్లోపు గర్భాన్ని మాత్రమే తొలగించేందుకు అనుమతి కల్పించాలి. అది కూడా మహిళ ప్రాణానికి ఎలాంటి ముప్పు రాదని నిర్ధరించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.






