Washington: కాల్పుల విరమణ ప్రసక్తే లేదు.. పుతిన్ వ్యాఖ్యలపై ట్రంప్ ఫైర్

ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా తోసిపుచ్చింది. దీంతో ఆగ్రహించిన అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)పై మరోసారి మండిపడ్డారు. ఆయన తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్న ట్రంప్.. మాస్కోపై ఆంక్షలకు సిద్ధమయ్యారు. మరోవైపు, ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు అంగీకరించారు.
‘‘ఆయన ఉద్దేశమేంటో అర్థమవుతోంది. పగలు ఆయన చాలా అందంగా మాట్లాడుతారు. రాత్రయితే ప్రజలపై బాంబులతో (Russia Ukraine War) విరుచుకుపడుతారు. అలాంటి ప్రవర్తన మాకు నచ్చట్లేదు’’ అని ట్రంప్ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మాస్కోపై ఆంక్షల విధించే అంశాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. ‘‘రష్యాపై కొత్త, కఠిన ఆంక్షలు అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.కాగా.. మాస్కోపై ఆంక్షల కోసం ఓ ద్వైపాక్షిక బిల్లును యూఎస్ సెనెటర్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రష్యాకు సాయం చేసే దేశాలపై 500శాతం టారిఫ్‌లు విధించేలా ఈ బిల్లును రూపొందించినట్లు రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్ తెలిపారు.
ఉక్రెయిన్‌కు ఆయుధాలు..
మరోవైపు, రష్యా (Russia)తో సుదీర్ఘంగా పోరాటం చేస్తోన్న ఉక్రెయిన్ (Ukraine)కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్ అంగీకారం తెలిపారు. పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కీవ్‌కు పంపించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి ఆ దేశానికి చాలా అత్యవసరమని అన్నారు. అయితే, ఎన్ని ఆయుధాలను పంపిస్తామన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.
ఉక్రెయిన్‌కు కీలక ఆయుధాల సరఫరాను నిలిపివేస్తామని ఇటీవల ప్రకటించిన ట్రంప్.. కొద్ది రోజులకే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ దేశానికి రక్షణాత్మక ఆయుధ వ్యవస్థలను అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ఆయుధాలను తాము ఉచితంగా ఇవ్వబోమని తెలిపారు. వీటికి 100 శాతం చెల్లింపులు జరుగుతాయని, మేం వ్యాపారం చేస్తామని స్పష్టం చేశారు.