Myanmar: మయన్మార్ భూకంపానికి ప్రధాన కారణం సగాయింగ్ ఫాల్ట్..?
మయన్మార్లో చోటుచేసుకున్న తీవ్ర భూకంపం (Earthquake) .. ఆదేశంలో పలునగరాలను నేలమట్టం చ చేసింది. ఈ విలయం కారణంగా ఎత్తైన భవంతులు, పురాతన వంతెనలు సహా అనేక కట్టడాలు కుప్పకూలిపోయాయి. ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంది. భూకంప కేంద్రం మధ్య మయన్మార్లో (Myanmar) ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది ‘సగాయింగ్ ఫాల్ట్’కు సమీపంలో ఉంటుంది. అసలేమిటీ ప్రాంతం..? ఇక్కడే ఎందుకు తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి..?
ఏమిటీ సగాయింగ్ ఫాల్ట్(Sagaing fault)..?
సాధారణంగా భూమి పైపొరలో అనేక ఫలకాలు (tectonic plates) ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు. ఈ ఫలకాల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొంటుంటాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రోప్లేట్ల మధ్య సగాయింగ్ ఫాల్ట్ (Sagaing Fault) ఉంటుంది. మయన్మార్లో ఇది దాదాపు 1200 కి.మీల మేర విస్తరించింది.
భూ ఫలకాలు ఎప్పుడూ కదులుతుంటాయి. ఈ కదలికలు సగాయింగ్ ఫాల్ట్లో ఏడాదికి 11 మి.మీ నుంచి 18 మి.మీ వేగంగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 18 మి.మీ అంటే చాలా ఎక్కువ అని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగుతుండటంతో.. కాలక్రమేణా అంచుల వద్ద రాపిడికి గురై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది. ఒత్తిడి మరీ ఎక్కువ ఉంటే పగుళ్లు ఏర్పడతాయి. భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే.. నష్టం అంత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఫలకాలు వేగంగా ఘర్షణకు లోనవుతున్న కారణంగానే మయన్మార్ ప్రాంతంలో తరచూ భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి.
గతంలో భయానక ఘటనలు..
సగాయింగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్లో గతంలో అనేక భూకంపాలు సంభవించాయి. రెడ్ జోన్లో ఉన్న ఈ ప్రాంతంలో గత వందేళ్లలో 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు వచ్చినట్లు అంచనా. 1946లో 7.7 తీవ్రతతో రాగా.. 1956లోనూ 7.1 తీవ్రతతో భూమి కంపించింది. 1988లో షాన్లో, 2004లో కోకో ద్వీపంలో వచ్చిన బలమైన ప్రకంపనలతో వందలాది మంది చనిపోయారు. 2011లో టార్లేలో వచ్చిన భూకంపంలో 151 మంది ప్రాణాలు కోల్పోయారు, 2016లోనూ 6.9 తీవ్రతతో రాగా.. తాజాగా 7.7 తీవ్రతతో ఇది సంభవించింది.






