China: భారత్-చైనా మధ్య చర్చలు మొదలు.. ఉపఖండంలో నవశకం ఆరంభమవుతుందా..?

భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ (Han Zheng)తో సమావేశమై.. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై చర్చించారు. షాంఘై సహకార సంస్థ (SCO) అధ్యక్ష పదవికి చైనాకు భారత మద్దతును తెలియజేశారు. బీజింగ్ ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను కలవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. కైలాస మానససరోవర్ యాత్రను పునఃప్రారంభించినందుకు భారత ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఐదేళ్ల అనంతరం అటానమస్ రీజియన్ షిజాంగ్ (టిబెట్)లో ఉన్న మాపవ్ యున్ సో (మానససరోవర్ సరస్సు)కు భారత యాత్రికులు చేరుకోవడంపై సంతోషం వ్యక్తంచేశారు.
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థికవ్యవస్థలు, పొరుగు దేశాలుగా భారత్-చైనా మధ్య అభిప్రాయాలు, దృక్పథాలపై చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇటీవల కజాన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్నాయన్నారు. మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వచ్చే నెలలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval)తో భేటీ అవ్వడానికి భారత్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2020లో గల్వాన్ ఘటనతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత భారత విదేశాంగశాఖ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. జులై 14, 15 తేదీల్లో టియాంజిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) కౌన్సిల్ సమావేశం జరగనుంది. బీజింగ్‌లో ద్వైపాక్షిక చర్చల అనంతరం జై శంకర్ అక్కడికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దెబ్బతిన్న సంబంధాలను సరిదిద్దుకునేందుకే శిఖరాగ్ర సమావేశానికి ముందే ఇరుదేశాల నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇటీవల చైనాలో పర్యటించారు. జూన్‌లో చైనాలోని క్వింగ్డావోలో షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల రక్షణ మంత్రిత్వస్థాయి సదస్సుకు ఆయన హాజరయ్యారు. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు, దలైలామా వారసత్వంపై ఇటీవల చెలరేగిన వివాదం వేళ జైశంకర్ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.