డొనాల్డ్ ట్రంప్ ధిక్కార టీ షర్టుల జోరు
అటు తూటాల వర్షం. ఇటు చెవి నుంచి చెంప మీదుగా బొటబొటా కారుతున్న రక్తం. అంతలోనే రక్షణ వలయంగా కమ్ముకున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది. అంతటి భీతావహ పరిస్థితిలోనూ పిడికిలి గట్టిగా బిగించి పైకెత్తి పోరాటమే నంటూ గొంతెత్తి నినాదాలు. ట్రంప్‌పై దాడి జరిగిన క్షణాలకు శాశ్వతత్వం కల్పించిన పొటో ఇది. హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డ క్షణాల్లో కూడా ట్రంప్ ఆత్మనిబ్బరానికి, ఆయన ప్రదర్శించిన సాహసానికి ప్రతీకగా నిలిచిన ఈ పోటో అప్పుడే టీ షర్టులపైకి కూడా ఎక్కింది. అది కూడా దాడి జరిగిన రెండు గంటల్లోపే. అంత తక్కువ సమయంలోనే టావోబావో, జేడీ.కామ్ వంటి చైనా ఈ కామర్స్ దిగ్గజాలు ఆన్లైన్ దుకాణాలు ఆ ఫొటోలతో కూడిన టీ షర్టులను తయారు చేయడం, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల్లో అమ్మకానికి పెట్టడం చకచకా జరిగిపోయాయి. వాటికి చూస్తుండగానే చైనా, అమెరికాల నుంచి 2,000 పై చిలుకు ఆర్డర్లు వచ్చాయి..






