Ukraine : ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన ఇక మా సారథ్యంలో
అమెరికాకు బదులుగా ఇకపై ప్రపంచ పెద్దన్న పాత్రను పోషించేందుకు బ్రిటన్ సిద్ధమవుతున్నట్టు కన్పిస్తోంది. రష్యాతో ఘర్షణకు తెర దించి ఉక్రెయిన్ (Ukraine)లో శాంతి నెలకొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇక బ్రిటన్ సారథ్యం వహిస్తుందని ఆ దేశ ప్రధాని కియర్ స్టార్మర్ (Keir Starmer ) ప్రకటించారు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్‌కు సైనికంగా, ఆర్థికంగానే గాక అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని పునరుద్ఘాటించారు. ఈ ప్రయత్నాల్లో ఇతర దేశాలనూ కలుపుకుని సాగుతాం. ఇందుకు అమెరికా (America) చాలా కీలకం అని చెప్పారు. ఉక్రెయిన్ విషయమై స్టార్మర్ చొరవ తీసుకుని మరీ యూరప్ దేశాలతో లండన్ (London)లో అత్యవసర భేటీ నిర్వహించడం తెలిసిందే. అందులో చర్చించిన అంశాలను ఆయన పార్లమెంటుకు వివరించారు. ఈ విషయం లో స్టార్మర్‌కు విపక్ష కన్జర్వేటివ్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించడం విశేషం.






