US: స్పేస్ ఎక్స్ కు మరో ఎదురుదెబ్బ.. స్టార్ షిప్ రాకెట్ ఫెయిల్యూర్…
అంతరిక్ష రంగంపై క్రమంగా పట్టు సాధిస్తున్న ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన స్పేస్ఎక్స్ కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. స్పేస్ షిప్ ప్రయోగించిన స్టార్‌షిప్ (Starship Rocket) మెగా రాకెట్ విఫలమైంది. టెక్సాస్‌లోని బొకాచికా వేదికగా ఓ రాకెట్‌ను ప్రయోగించారు. అయితే, ఆ రాకెట్ తొలుత విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినా అంతరిక్షంలో అది పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
రాకెట్ పేలిపోవడంపై స్పేస్ఎక్స్ (SpaceX) స్పందించింది. ఇటీవల నిర్వహించిన ప్రయోగం సైతం ఇలాగే జరిగినట్లు తెలిపింది. వీటినుంచి పాఠాలు నేర్చుకుంటామని వెల్లడించింది. ఇక, రాకెట్ పేలిపోవడంతో దానినుంచి భారీగా శకలాలు కిందికి దూసుకొచ్చాయి. ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో ఈ శకలాలు తారాజువ్వల్లా కనిపించాయి. ఈ క్రమంలోనే ఎయిర్ ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది
ఇదిలాఉండగా.. జనవరిలోనూ స్పేస్ఎక్స్ నిర్వహించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్‌షిప్ విఫలమైంది. సాంకేతిక కారణాల వల్లే రాకెట్ పేలిపోయినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఆ రాకెట్‌కు సంబంధించిన శకలాలు కరేబియన్ సముద్రంలో పడ్డాయి. అయితే, బూస్టర్ క్షేమంగా లాంచ్ ప్యాడ్ పైకి చేరింది.






