Russia : రష్యాకు మరిన్ని ఉత్తరకొరియా బలగాలు
ఉక్రెయిన్‌తో జరిగే యుద్ధంలో రష్యా (Russia)కు సాయంగా ఉత్తర కొరియా మరిన్ని సైనిక బలగాలను పంపించినట్లు దక్షిణ కొరియా (South Korea) నిఘా విభాగం చెబుతోంది. రష్యా -ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో మోహరించిన తమ బలగాలకు భారీగా నష్టం వాటిల్లడంతో అదనంగా సైనికులను పంపించిందనీ, అయితే వారి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉందని నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ( ఎన్ఐఎస్) తెలిపింది. ఈ అదనపు సైన్యాన్ని ఉక్రెయిన్ (Ukraine) ఆక్రమించిన రష్యాకు చెందిన కస్క్ ప్రాంతంలోకి ఫిబ్రవరి మొదటి వారంలో పంపినట్లు తెలిపింది. రష్యా, ఉత్తర కొరియా బలగాలను తమ సైన్యం కస్క్‌లో ఎదుర్కొంటున్న విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) కూడా ఫిబ్రవరి 7వ తేదీన ధ్రువీకరించారు. రష్యాకు పెద్ద మొత్తంలో సంప్రదాయక ఆయుధాలతోపాటు ఉత్తరకొరియా 10 వేల నుంచి 12 వేల సైనికులను కూడా తరలించినట్లు అమెరికా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్ నిఘా అధికారులు అంటున్నారు.






