Pritam Singh : పార్లమెంటులో అబద్ధాలు.. ఆ ఎంపీకి రూ.9 లక్షల జరిమానా
సింగపూర్‌లోని భారత సంతతి నేత ప్రీతమ్ సింగ్ (Pritam Singh)కు ఓ కేసులో చుక్కెదురైంది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనపై పార్లమెంటు (Parliament) లో అబద్ధాలు చెప్పారనే అభియోగాలు రుజువయ్యాయి. దీంతో 14 వేల డాలర్ల (సింగపూర్ కరెన్సీ) జరిమానా విధిస్తూ స్థానిక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే, ఈ శిక్షతో పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటు పడే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. భారత సంతతికి చెందిన ప్రతీమ్ సింగ్ సింగపూర్ వర్కర్స్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే, ఆ పార్టీకి చెందిన మాజీ సభ్యురాలు రయీసా ఖాన్ (Raisa Khan )పై 2021లో పార్లమెంటులో అబద్ధం చెప్పారనే ఆరోపణలు రావడంతో ప్రివిలేజెస్ కమిటీ (Privileges Committee ) విచారణ చేపట్టింది. కమిటీ ముందు విచారణకు హాజరైన ప్రీతమ్ సింగ్, రెండు సందర్భాల్లో తప్పుడు వాంగ్మూలం ఇచ్చారనే అభియోగాలు వచ్చాయి. దీనిపై నాలుగు నెలల క్రితం విచారణ మొదలైంది.
రెండు అభియోగాల్లో ప్రీతమ్ నేరం రుజువు కావడంతో ఒక్కో కేసులో గరిష్ఠంగా 7 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధిస్తూ స్థానిక న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయితే, సింగపూర్ రాజ్యాంగం ప్రకారం ఏదైనా కేసులో ఎంపీ (MP)కి కనీసం ఏడాది జైలుశిక్ష లేదా 10 వేల సింగపూర్ డాలర్లు జరిమానా పడితే పార్లమెంటు సభ్యత్వం కోల్పోతారు.






