Canada: భారత్ కు మరింత దగ్గరగా కెనడా.. బంధం బలోపేతం దిశగా అడుగులు..

భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ. త్వరలోనే మూడోస్థానానికి చేరే అవకాశాలున్నాయి. అంతేకాదు… భారత్ వ్యాపార అవకాశాలకు చక్కని నెలవు. అలాంటి భారత్ ను దూరం పెట్టడం అంటే అది మూర్ఖత్వమే.. ఆ విషయం నాటి ప్రదాని ట్రూడోకు అర్థం కాకపోవచ్చు. కానీ..ప్రస్తుత ప్రధాని కార్నీ మాత్రం.. దాన్ని చక్కగా గుర్తించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో దూసుకెళ్తున్న భారత్ తో సంబంధాలు మరింతబలోపేతం చేసుకోవాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా.
అంతర్జాతీయ వాణిజ్యరంగంలో వైవిధ్యంగా ముందుకువెళ్తున్న భారత్‌తో (India) సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కెనడా (Canada) ప్రభుత్వం స్పష్టం చేసింది. వివిధ సుంకాలు విధించి విసిగిస్తున్న అమెరికాతో.. వాణిజ్య సంబంధాలను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో.. భారత్‌తో చర్చలు జరపాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. వచ్చేవారం అల్బెర్టా వేదికగా జరగనున్న జీ7 సమావేశాలకు (G7 Summit) భారత్ ప్రధాని మోడీని ఆహ్వానించడంపై అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈమేరకు స్పందించింది. ఆర్థిక ప్రాధాన్యతలపై చర్చించడానికి జీ7 ముఖ్యమైన వేదిక అని కెనడా అంతర్జాతీయ వాణిజ్యశాఖ మంత్రి మనీందర్ సంధూ వ్యాఖ్యానించారు.
‘‘ కెనడా ఆర్థిక ప్రాధాన్యతలపై చర్చించేందుకు జీ7 ఓ ముఖ్యమైన వేదిక. పరస్పర ఆర్థిక సహకారం, జాతి భద్రతకు సంబంధించిన అంశాల గురించి విపులంగా చర్చించేందుకు అవకాశం ఉంటుంది. కొంతమంది నాయకులను ఆహ్వానించడంపై స్థానిక నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ ఆర్థిక సంక్షోభ సమయంలో పరస్పరం సహకరించుకోవాలి. మన సమస్యలు కొన్నింటిని పరిష్కరించుకోగలగాలి. విమర్శలకు పదునుపెడుతున్న నాయకులు ఈ విషయాన్ని గుర్తిస్తారని భావిస్తున్నాను’’ అని మనీందర్ మీడియాకు తెలిపారు. జీ7 సదస్సులో ప్రధానంగా జాతి భద్రత, విదేశీ జోక్యం అంశాలపై చర్చించబోతున్నట్లు ప్రధాని మార్క్ కార్నీ ఇప్పటికే స్పష్టం చేశారన్న ఆయన.. పరస్పర ఆర్థిక సహకారంపైనా సదస్సులో చర్చించబోతున్నట్లు తెలిపారు.
మరోవైపు కెనడా గడ్డపై హింసకు తావులేదని మనీందర్ పునరుద్ఘాటించారు. భారత్‌తో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్నా, ముఖాముఖి మాట్లాడాలన్నా జీ7 సదస్సు ఓ చక్కని వేదికని పేర్కొన్నారు. ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ ఆయన ఆరోపించడంతో.. భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. క్రమంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి.