భారతీయ రచయిత్రికి కామన్వెల్త్ బహుమతి
కామన్వెల్త్ కథానికల పోటీలో ముంబయికి చెందిన 26 ఏళ్ల సంజనా ఠాకూర్ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఈ బహుమతి కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 7,359 మందిలో ఆమె ప్రథమురాలిగా నిలిచినట్లు లండన్లో ప్రకటించారు. ఆమెకు 5,000 పౌండ్ల నగదు ప్రదానం చేస్తారు. సంజన కథకు శీర్షిక ఐశ్వర్యా రాయ్ కావడం విశేషం. ముంబయిలో ఇరుకైన అపార్ట్మెంట్లో నివసిస్తున్న అవని అనే యువతి కథ అది. ఫలానావారు తనకు తల్లి అయి ఉంటే ఎలా ఉంటుందని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఒక తల్లి పరిశుభ్రతకు అతిగా ప్రాధాన్యమిస్తే, మరో తల్లి బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్లా అందాల రాశి. ఆధునిక నగర జీవితంలో కుటుంబాలు విచ్చిన్నమవుతున్న తీరుకు ఈ కథ అద్దం పడుతుంది.






