Washington: ఏమిటీ సాల్ట్ టైపూన్.. ఈ గ్రూప్ పేరు చెబితే అమెరికా సైతం ఎందుకు వణుకుతోంది..?

అగ్రరాజ్యం అమెరికా సాంకేతిక శక్తికి ఓ సైబర్ ముఠా సవాల్ విసురుతోంది. చైనాకు చెందిన సాల్ట్ టైపూన్ (Salt Typhoon) దెబ్బకు .. అగ్రరాజ్యం సైతం గజగజా వణుకుతోంది. తన సాంకేతిక శక్తిని అమెరికాకు సైతం చవిచూపిస్తోంది ఈ హ్యాకింగ్ ముఠా. ‘సాల్ట్ టైఫూన్’ అనే పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ హ్యాకింగ్ గ్రూప్ జరిపిన భారీ సైబర్ దాడుల కారణంగా, అమెరికాలోని దాదాపు ప్రతి పౌరుడి వ్యక్తిగత సమాచారం చైనా చేతికి చిక్కి ఉండవచ్చని భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఏడాది పాటు సాగిన సుదీర్ఘ దర్యాప్తు అనంతరం వెలుగు చూసిన ఈ వాస్తవాలు అగ్రరాజ్యంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత వారం నిపుణులు విడుదల చేసిన ఈ సంచలన ప్రకటనపై అమెరికాతో పాటు కెనడా, జర్మనీ, జపాన్, ఇటలీ, స్పెయిన్, ఫిన్లాండ్ వంటి దేశాలు కూడా సంతకాలు చేయడం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
‘సాల్ట్ టైఫూన్’ ముఠా కార్యకలాపాలు కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. 2019 నుంచి ఈ బృందం ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 దేశాల్లోని 200కు పైగా కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా అమెరికాలో వీరి చొరబాటు ఊహించిన దానికంటే చాలా విస్తృతంగా ఉందని, బహుశా దేశంలోని ప్రతి ఒక్కరి సమాచారాన్ని ఈ ముఠా ఇప్పటికే తస్కరించి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దాడులు చైనా హ్యాకింగ్ సామర్థ్యాలకు నిలువుటద్దం పడుతున్నాయని వారు పేర్కొన్నారు. అత్యంత పకడ్బందీగా, సమన్వయంతో సాగుతున్న ఈ దాడులు ఏ ఒక్క రంగానికీ పరిమితం కాకపోవడం గమనార్హం.
ఈ సైబర్ ముఠా ప్రధానంగా టెలికమ్యూనికేషన్ కంపెనీలపై దృష్టి సారించింది. ఇప్పటికే అరడజనుకు పైగా టెలికాం సంస్థల నెట్‌వర్క్‌లలోకి వీరు చొరబడినట్లు అధికారులు గుర్తించారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్ వ్యవస్థలపై పట్టు సాధించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలా సేకరించిన డేటాతో రాజకీయ నాయకులు, గూఢచారులు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకర్తలు వంటి కీలక వ్యక్తుల కదలికలను, సంభాషణలను నిరంతరం గమనించే అవకాశం చైనాకు లభిస్తుందని వారు విశ్లేషిస్తున్నారు.
ఈ ముఠాకు చైనా ప్రభుత్వం నుంచే నేరుగా నిధులు అందుతున్నాయని, వారి అండదండలతోనే ఇంత భారీ స్థాయిలో దాడులు జరుగుతున్నాయని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ రవాణా, లాజిస్టిక్స్, సైనిక మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అమెరికన్, బ్రిటిష్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ముఠాకు చైనా (China) సైన్యం, పౌర నిఘా ఏజెన్సీలతో సంబంధాలున్న మూడు కంపెనీలతో సంబంధాలున్నట్లు కూడా ఆధారాలు లభించాయి. అయితే ఈ తీవ్ర ఆరోపణలపై లండన్‌లోని చైనా దౌత్య కార్యాలయం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ సైబర్ దాడులు కేవలం అమెరికాకే కాకుండా ప్రపంచ భద్రతకే పెను ముప్పుగా మారుతున్నాయని, దేశాలన్నీ తమ సైబర్ భద్రతా వ్యవస్థలను తక్షణమే బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.