Putin:భారత్, చైనాలనే బెదిరిస్తారా? ..అమెరికా పై పుతిన్ ధ్వజం

భారత్, చైనాలపై ఒత్తిడి తెచ్చేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రయత్నిస్తున్నారని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) విమర్శించారు. శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలను నడిపే దేశాల నేతలపై వలసవాద కాలంనాటి వ్యూహాలను ప్రయోగించాలని చూడటం తగదని మందలించారు. భాగస్వాములతో వ్యవహరించాల్సిన తీరు అది కాదని స్పష్టం చేశారు. చైనా ఆయుధ ప్రదర్శనను వీక్షించడానికి బీజింగ్ (Beijing) కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ (India) , చైనా (China) లు రెండు జనాభాపరంగా పెద్ద దేశాలు. వాటికి రాజకీయ వ్యవస్థలు, సొంత చట్టాలు ఉన్నాయి. శిక్షిస్తామంటూ అలాంటి పెద్ద దేశాలకు చెప్పేముందు వాటికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది ఆలోచించాలి. తమ చరిత్రలో క్లిష్ట సమయాలను దాటిన అలాంటి దేశాలు ఎలా స్పందిస్తాయనేది గమనంలో తీసుకోవాలి. సార్వభౌమత్వంపై దాడికి దిగిన వలసవాదులతో దీర్ఘకాలం పోరాడిన చరిత్ర ఈ దేశాలకు ఉంది. వీటిలో ఏ దేశ నేత అయినా బలహీనంగా ఉంటే వారి రాజకీయ ప్రస్థానం ముగిసిపోతుంది. ఆ అంశం వారి వ్యవహారశైలిపై ప్రభావం చూపిస్తుంది. ఈ దేశాలు, వాటి నేతలపై ట్రంప్‌నకు ఉన్న అవగాహన సందేహమే అని అన్నారు.