Putin: పుతిన్ కీలక వ్యాఖ్యలు.. అప్పుడే యుద్ధం ముగింపు
ఉక్రెయిన్‌తో శాంతిచర్చలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) షరతు విధించారు. యుద్ధం ముగించేందుకు అమెరికా (America) మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ (Zelensky) ప్రభుత్వంతో చర్చలకు తాను విముఖంగా ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. కీవ్ (Kiev) లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే యుద్దం ముగింపునకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. రష్యాలోని ముర్మాన్స్క్ ప్రాంతంలో పర్యటించిన పుతిన్ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ (Ukraine) చర్చలు, ఆ దేశాధ్యక్షుడిగా జెలెన్స్కీ చట్టబద్ధత గురించి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. శాంతి స్థాపనక కోసం రూపొందించిన పత్రాలపై ఎవరు సంతకం చేస్తారన్నది ఇప్పుడే తెలియదని, ఆ దేశంలో అధికారంలో ఉన్నది ఎవరో స్పష్టంగా లేదని పేర్కొన్నారు. జెలెన్స్కీ పదవీకాలం గతేడాదే ముగిసిన ఇంతవరకూ అక్కడ ఎన్నికలు జరగలేదని పుతిన్ గుర్తు చేశారు. అందువల్ల ఆ దేశంలో అధికార యంత్రాంగం చట్టవిరుద్ధమైనదని అభివర్ణించారు.






