Moscow: ఆర్థిక మాంద్యం అంచున రష్యా.. ఉక్రెయిన్ తో యుద్ధం ఎఫెక్ట్..!

ఉక్రెయిన్(ukraine) తో యుద్ధం రష్యాకు పరువు, ప్రతిష్టలుగా మారింది. ఓ వైపు యుద్ధం కారణంగా వేలాదిమంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు.. లక్షలాదిగా క్షిపణులు.. ఉక్రెయిన్ భూభాగంపై ప్రయోగిస్తుండడంతో.. ఆయుధ సంపత్తి తరిగిపోతోంది. ఇక అభివృద్ధి దిశగా ఎలాంటి పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపించడం లేదు. దీనికి తోడు ఆదేశంలో పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు రష్యాకు ఊపిరి తీసుకోనివ్వడం లేదు. దీంతో రష్యా ఆర్థికమాంద్యంలోకి జారుకుంటోందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
ఇన్నాళ్లు దాన్ని తోసిపుచ్చుతూ వచ్చిన మాస్కో.. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నిజాన్ని అంగీకరించాల్సి వచ్చింది. తమ దేశం మాంద్యం అంచున ఉందని సాక్షాత్తూ రష్యా వాణిజ్యశాఖ మంత్రి మాక్సిమ్ రెషెత్నికోవ్ వెల్లడించారు. రష్యాకు (Russia) పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక వేదిక సదస్సులో ప్రసంగించిన ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత వాణిజ్యం, సూచీలను బట్టి చూస్తే తాము మాంద్యం (Recession) అంచుల్లో ఉన్నట్లు కనిపిస్తోందని, మాంద్యంలోకి జారుకుంటామా లేదా అన్నది ప్రభుత్వం తీసుకునే ద్రవ్యవిధాన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందన్నారు.
ఉక్రెయిన్‌పై 2022లో రష్యా మొదలుపెట్టిన యుద్ధం (Ukraine Crisis) సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని దేశాలు ఆంక్షలు విధించడం క్రెమ్లిన్ ఆర్థిక కష్టాలకు కారణమైంది. సైన్యానికి భారీస్థాయిలో ఖర్చు చేస్తుండటం ఆర్థికవృద్ధిపై ప్రభావం చూపింది. ద్రవ్యోల్బణం తీవ్రమైనప్పటికీ.. నిరుద్యోగిత మాత్రం తక్కువగానే కనిపించింది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెరగడంతో కార్మికులు మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది.
సైన్యంలో చేరే వారికి భారీ మొత్తంలో బోనస్‌లు ఇవ్వడం, ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం వంటి చర్యలను పుతిన్ ప్రభుత్వం చేపట్టింది. అయితే, దీర్ఘకాల ద్రవ్యోల్బణం, విదేశీ పెట్టుబడులు లేకపోవడం వంటివి ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారాయి. దీంతో సైనిక ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఎంతకాలం మనుగడ సాధిస్తుందనే ప్రశ్న మొదలైంది. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని, సైన్యం మినహా ఇతర రంగాల్లో పెట్టుబడులు లేకపోవడం కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు.