24 ఏళ్ల తరువాత తొలిసారిగా… ఉత్తర కొరియాకు చేరిన పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం 24 ఏళ్ల తరువాత తొలిసారి ఉత్తర కొరియాలో అడుగుపెట్టారు. బుధవారం తెల్లవారు జామున ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లోని విమానాశ్రయంలో పుతిన్‌కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఘన స్వాగతం పలికారు. ఉత్తర కొరియాకు బయలు దేరడానికి ముందు పుతిన్ మీడియతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై తాము చేపట్టిన సైనిక చర్యకు మద్దతిస్తున్నందుకు ఆ దేశానికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికా నేతృత్వంలో తమపై విధించిన ఆంక్షలను అధిగమించడానికి తమ రెండు దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని పేర్కొన్నారు. అలాగే ఇరు దేశాలు వాణిజ్యాన్ని విస్తరించుకోవడంతో పాటు పశ్చిమ ( అమెరికా మొదలైన) దేశాల నియంత్రణలేని చెల్లింపుల విధానాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు.






