బ్రూనైలో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన క్రౌన్ ప్రిన్స్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక పర్యటన నిమిత్తం బ్రూనై దారుస్సలాం చేరుకున్నారు. మోదీకి బ్రూనై విమానాశ్రయంలో క్రౌన్ ప్రిన్స్ హాజీ అల్ ముహతాబీ బిల్లాప్ా ఘన స్వాగతం పలికారు. ఆగ్నేయాసియా దేశమైన బ్రూనైలో భారత ప్రధాని ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే మొదటిసారి. బ్రూనై గడ్డపై దిగిన మోదీకి అక్కడి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో మోదీ బ్రూనై దళాలచే గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. ప్రధాని మోదీ బస చేసిన హోటల్ వద్ద ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. హృదయపూర్వక స్వాగతాన్ని అందించిన భారతీయ సమాజం సభ్యులతో మోదీ సమావేశమయ్యారు.
తన పర్యటన సందర్భంగా అక్కడి భారత హై కమిషన్ కొత్త ఛాన్సరీ ప్రాంగణాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత రాయబార కార్యాలయం ఉద్యోగులు, ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు వారు అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. అక్కడ దీపం వెలిగించిన మోదీ ప్రారంభానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి నేరుగా బ్రూనై రాజధాని బందర్ సెరీ బెగవాన్లో ఉన్న ఒమర్ అలీ సైపుద్దీన్ మసీదును మోదీ సందర్శించారు.






