Zelensky : ట్రంప్‌తో వాగ్వాదం.. జెలెన్స్కీకి పెరిగిన ప్రజామోదం
ఇటీవల వైట్‌హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) మధ్య వాగ్వాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రంప్ మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో జెలెన్స్కీకి ప్రజల మద్దతు లేదని, ఆయన ఓ నియంత అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఉక్రెయిన్ (Ukraine)లో జెలెన్స్కీకి ఉన్న మద్దతుపై అభిప్రాయ సేకరణలు చేపట్టాయి. తాజాగా విడుదలైన నివేదికల్లో ట్రంప్‌తో వాగ్వాదం తర్వాత ఆయనకు ప్రజామోదం 10 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. కీవ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ నిర్వహించిన పోల్‌లో 67 శాతం ఉక్రెయిన్ ప్రజలు తాము జెలెన్స్కీని విశ్వసిస్తున్నామని తెలిపారు. తొలుత 57 శాతంగా ఉన్న ఆయన మద్దతుదారులు ఆమెరికా (America)లో ట్రంప్‌తో భేటీ అనంతరం 10 శాతం పెరిగారని పేర్కొన్నారు. ట్రంప్ దురుసు ప్రవర్తనతో తమ అధినేతను అవమానించినట్లు ప్రజలు భావించారని, అదే జెలెన్స్కీకి మద్దతు పెరగడానికి ముఖ్య కారణమని భావిస్తున్నారు.






