మోదీ రష్యా పర్యటన విజయవంతం
భారత ప్రధాని నరేంద్ర మోదీ 3వ సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన విజయవంతమైంది. మాస్కోలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు మంచి స్పందన వచ్చింది. ఈ సందర్బంగా ప్రవాస భారతీయులనుద్దేశించి జూంమోదీ ప్రసంగించారు. పేదల కోసం 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని, జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని, భారత దేశం మారుతోందని ప్రపంచమంతా గుర్తించిందని, భారత్ అభివృద్ధి చూసి ప్రపంచం నివ్వెరపోతోందని మోదీ వ్యాఖ్యానించారు. డిజిటల్ పేమెంట్లలో రికార్డులు సృష్టిస్తున్నామన్నారు. పదేళ్లలో 40 వేల కి.మీ. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశామని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించామని పేర్కొన్నారు. అభివృద్ధిలో 140 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఇటీవల టీమ్ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భాన్ని మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. గెలుపు కోసం వారు పడిన ఆరాటం.. అందుకు సాగించిన ప్రయాణమే వారి విజయం వెనుక ఉన్న అసలు కథ. ఈ రోజుల్లో యువత చివరి క్షణం (చివరి బంతి) వరకు ఓటమిని అంగీకరించడం లేదు. అలా ముందుకుసాగే వారినే విజయం వరిస్తుంది అని రోహిత్ సేనను ప్రధాని కొనియాడారు. అలాగే మన ఇరు దేశాల సంబంధాలు బలోపేతం కావడంతో సినిమాలది కీలక పాత్ర అని చెప్పారు.
ఈ సందర్భంగా అలనాటి ప్రముఖ నటులు రాజ్‌కపూర్, మిథున్ చక్రవర్తి ప్రస్తావన తీసుకొచ్చారు. వారి సినిమాలు రష్యాలో ప్రజాదరణ పొందాయని చెప్పారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ.. భారత విద్యార్థులు చిక్కుకుపోతే, వారిని కాపాడటంలో పుతిన్ సహకరించారని మోదీ గుర్తుచేశారు. ఈసందర్భంగా ఆయనతో పాటు రష్యా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ’’భారత్-రష్యా నమ్మకమైన మిత్రులు. పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా ఈ స్నేహం కొనసాగుతోంది. రష్యాలో చలికాలంలో ఉష్ణోగ్రతలు ఎంత మైనస్‌లోకి పడిపోయినా సరే.. మన రెండు దేశాల మధ్య బంధం ఎప్పుడూ ప్లస్‌లోనే ఉంటుంది. అది మన స్నేహాన్ని ఆహ్లాదంగా ఉంచుతుంది. ఇప్పటివరకు నేను ఆరుసార్లు రష్యాలో పర్యటించాను. పుతిన్‌తో 17 సార్లు భేటీ అయ్యాను’’ అని తెలిపారు. ప్రతి భారతీయుడు దేశాన్ని మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారతదేశ విజయాల గురించి ఎన్నారైలు గర్వంగా మాట్లాడుతున్నారని.. ఈ రోజు భారత్ చంద్రుని భాగంలోకి చంద్రయాన్ పంపింది. మరే ఇతర దేశం ఆ స్థాయికి చేరుకోలేదని గుర్తు చేశారు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను భారత్ కలిగి ఉందన్నారు. భారత్‌ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య మాస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల బంధంలో ‘నవ’ శకానికి నాంది పలికింది. 9 కీలక రంగాల్లో సహకారానికి సరిహద్దుల్లేని ఒప్పందానికి బాటలు పరిచింది. 2030 నాటికి రెండు దేశాల మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం లక్ష్యంగా నిర్ణయించింది. మరోవైపు మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని పుతిన్ అందజేశారు. శిఖరాగ్ర చర్చల సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు, తుపాకులు, బుల్లెట్లు శాంతి చర్చలను సఫలం చేయలేవని స్పష్టం చేశారు. అదే సమయంలో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని పరిష్కరించడంలో సహకరిస్తున్న మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల రష్యా పర్యటనకు వచ్చిన మోదీ మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత పుతిన్‌తో కలిసి రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల స్మారక స్థూపానికి నివాళులర్పించారు. అణు ఇంధన మ్యూజియాన్ని సందర్శించారు. 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సుల్లో పుతిన్‌తో కలిసి చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల తరఫున సంయుక్త ప్రకటన విడుదలైంది. గౌరవప్రదమైన వ్యూహాత్మక బంధాన్ని మరింత బలపరిచేలా సంబంధాలను కొనసాగించాలని శిఖరాగ్ర సదస్సులో ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. వ్యవసాయం నుంచి మౌలిక వసతులదాకా మరింతగా సహకరించుకోవాలని అనుకున్నారు.
రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత విస్తృత పరిచేందుకు కృషి చేస్తున్నందుకుగానూ ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్’ను అధ్యక్షుడు పుతిన్ క్రెమ్లిన్‌లోని సెయింట్ ఆండ్రూ హాలులో ప్రదానం చేశారు. 2019లోనే దీనిని మోదీకి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారత్ నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి నేతగా మోదీ రికార్డు సృష్టించారు. మొదటి అపోస్టిల్ ఆఫ్ జీసస్, పాట్రన్ సెయింట్ అయిన సెయింట్ ఆండ్రూ జ్ఞాపకార్థం దీనిని 1698లో ప్రారంభించారు. ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు.






