ట్రంప్, కమలను కలవకుండానే తిరిగొచ్చిన మోదీ
మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లిన ప్రధాని మోదీ సోమవారం రాత్రి తిరిగి ఢల్లీికి చేరుకున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి క్వాడ్ దేశాల సమావేశంలో పాల్గొన్నారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. అయితే ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ల అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను గానీ, డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హ్యారిస్‌ను గానీ కలవకుండానే వెనుదిరగడం చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధాని మోదీ తనను కలవనున్నారని ఆయన పర్యటనకు ముందు స్వయంగా ట్రంప్ కూడా చెప్పారు. కానీ, ప్రధాని బిజీ షెడ్యూల్ వల్లె వారిని కలవడం వీలుకాలేదని చెప్తున్నప్పటికీ, ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దనే ఉద్దేశంతోనే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.






