TFAS: తెలుగు కళా సమితి, న్యూజెర్సీ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి
న్యూజెర్సీలోని సోమర్సెట్ వడ్తాల్ ధామ్ స్వామినారాయణ మందిరంలో జనవరి 24 శనివారం నాడు తెలుగు కళాసమితి (TFAS) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు 400 మందికి పైగా ప్రవాస తెలుగు వారు విచ్చేసి వేడుకలను విజయవంతం చేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు..
తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా జరిగిన ఈ వేడుకల్లో పిల్లలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను చాటారు. సంక్రాంతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు, తెలుగు భాష పోటీలు, చిత్రలేఖనం, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గోమయంతో చేసిన గొబ్బెమ్మలకు పూజలు నిర్వహించి, పాటలు, నృత్యాలతో జరిపిన వేడుకలు అందరినీ అలరించాయి. సుమారు 70 మంది మహిళలు గొబ్బెమ్మల పూజలో పాల్గొని మాతృభూమి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ప్రత్యేక ఆకర్షణలు
ఈ ఏడాది ప్రత్యేకంగా నిర్వహించిన పెళ్ళి సందడి – యువతీ యువకుల పరిచయ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు 35 మంది యువతీ యువకులు ఇందులో పాల్గొనగా, ఈ కార్యక్రమం ఎంతో మర్యాదపూర్వకంగా సాగిందని సభ్యులు ప్రశంసించారు. అలాగే, సంక్రాంతి విశిష్టతను వివరిస్తూ ప్రదర్శించిన వీడియో, యువ వాలంటీర్ల సేవలు కార్యక్రమానికి వన్నె తెచ్చాయి.

అతిథులు, నిర్వాహకులు
టీఫాస్ అధ్యక్షులు మధు అన్నా నేతృత్వంలో కార్యవర్గ సభ్యులు ఈ వేడుకలను సమన్వయం చేశారు.వెంకట సత్య, లత మాడిశెట్టి పర్యవేక్షణలో పోటీలు విజయవంతంగా నిర్వహించారు. రఘు శర్మ శంకరమంచి, ఉపేంద్ర చివుకుల అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ ఊటుకూరి, ట్రెజరర్ వాణికోని శెట్టి, వరలక్ష్మి శ్రీనివాస్, శేషగిరి కంభం మెట్టు, లోకేంద్ర గిర్కల, అరుంధతి తమ బాధ్యతలను చక్కగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీపీ రావు, దాము గేదెల, ఉష దర్శిపూడి, రవి అన్నదానం, సన్నిధి సుబ్బారావు, సుధా దేవులపల్లి, సుధాకర్ ఉప్పల, బిందు మాదిరాజు ఇతరులు పాల్గొన్నారు. పోటీలకు సహకరించిన ఎంతో మంది న్యాయనిర్ణేతలను కార్యవర్గ సభ్యులు సత్కరించారు. చలిని సైతం లెక్కచేయకుండా తరలివచ్చి వేడుకలను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికీ అధ్యక్షుడు మధు అన్నా ధన్యవాదాలు తెలియజేశారు.






