France : మెక్రాన్ దంపతులకు మోదీ అపురూప కానుకలు
ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు మెక్రాన్(Macron), ఆయన సతీమణి బ్రిజిట్టెలకు ప్రధాని మోదీ (Modi) భారతీయ ఘన సంస్కృతి ఉట్టిపడే అపురూప కానుకలు అందించారు. ఛత్తీస్ గఢ్ (Chhattisgarh )లో ప్రసిద్ధిగాంచిన డోక్రా కళానైపుణ్యంతో రూపొందించిన లోహపు వాద్యకారుల బొమ్మలను మెక్రాన్‌కు ఆయన బహూకరించారు. సంగీతం సాంస్కృతిక ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా అవి ఉన్నాయి. రాజస్థాన్ (Rajasthan) హస్తకళా వైభవాన్ని కళ్లకు కట్టే టేబుల్ మిర్రర్‌ను బ్రిజిట్టెకు మోదీ అందజేశారు. దానిపై పుష్పాలు, నెమలి చిత్రాలు చెక్కి ఉన్నాయి.
ఫ్రాన్స్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ (J.D. Vance ) తో భేటీ అయిన మోదీ వాన్స్ ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెకు కూడా బహుమతులిచ్చారు. చెక్కతో చేసిన రైల్వే బొమ్మ, భారతీయ జానపద చిత్రాలతో కూడిన జిగ్సా పజిల్, చెక్కతో చేసిన అక్షరమాల వాటిలో ఉన్నాయి.






