బైడెన్‌కు వెండి రైలు.. జిల్కు కశ్మీర్ శాలువ
క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెండిరైలు నమూనాను అధ్యక్షుడు జో బైడెన్‌కు కానుకగా ఇచ్చారు. భారతీయ లోహపు కళాత్మకతకు మచ్చుతునకగా ఉన్న ఈ ఫిలిగ్రీ బొమ్మను మహారాష్ట్ర హస్త కాళాకారులు తయారు చేశారు. ఆవిరితో నడిచే రైలింజను కాలపు ఈ నమూనాపై భారత్, అమెరికా నడుమ ఉన్న పటిష్టమైన స్నేహ సంబంధాలను సూచిస్తూ ఢిల్లీ-డెలావర్ అనే నామ ఫలకంతో పాటు ఇండియన్ రైల్వేస్ అని మరో సూచిక ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేల సుదీర్ఘ చరిత్రకు ప్రతీకగా దీన్ని రూపొందించారు. అలాగే అమెరికన్ ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు జమ్మూకశ్మీర్ హస్తకళల విశిష్టతను చాటే పశ్మీనా శాలువను మోదీ బహుకరించారు. కాగితపు గుజ్జు, జిగురు, ఇతర సహజ సామగ్రి కలిపి చేతితో కళాత్మకంగా తయారు చేసిన అందమైన పెట్టేలో ఈ శాలువను అందించారు.






