Islamabad: శాంతి మంత్రం.. అణు యుద్ధ తంత్రం.. పాక్ రూటే సెపరేట్..!

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత భారత్, పాక్ రక్షణ వ్యవస్థలను ఆధునికీకరించడంపై ఫోకస్ పెట్టాయి. భారత్ సొంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటుంటే… పాకిస్తాన్ రష్యా, అమెరికా, ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఈక్రమంలో ఇది భారత ఉపఖండంలో అణుయుద్ధానికి దారి తీయొచ్చన్న భయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కొట్టిపారేశారు. ఇస్లామాబాద్‌లోని విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ అణు కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని షరీప్ పేర్కొన్నారు. దేశ రక్షణ కోసమే వాటిని వినియోగిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇటీవల భారత్- పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో 55 మంది తమ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్(Munir) గురించి కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని బలవంతంగా దించేసి మునీర్ ఆ స్థానాన్ని ఆక్రమించనున్నారంటూ వస్తున్న వార్తలను షరీఫ్ తోసిపుచ్చారు. అవన్నీ వదంతులని.. దేశాధ్యక్షుడు కావాలనే ఆకాంక్షను మునీర్ ఏనాడు వ్యక్తపరచలేదన్నారు.
పహల్గాంలో పర్యాటకులపై పాశవిక ఉగ్రదాడి … తదనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై చిన్నపాటియుద్ధం చేసింది.వాటిని పూర్తిస్థాయిలో ధ్వంసం చేసింది. ఎదురుదాడికి దిగిన పాక్ ఆయుధ సంపత్తిని సైతం నాశనం చేసింది. ఆతర్వాత ఇరు దేశాల మధ్య కాల్పులవిరమణ ఒప్పందం కుదిరింది.