Donald Trump: నోబెల్ పీస్ ప్రైజ్ ప్లీజ్.. మనసు పారేసుకున్న ట్రంప్..

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతిపై మనసు పడ్డారు. ఎలాగైనా ఆ అవార్డు తనకు రావాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. తాను ఆ బహుమతికి నూటికి నూరుపాళ్లు అర్హుడనని తలస్తున్నారు. అందుకు.. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానని ప్రకటించుకుంటున్నారు. భారత్ కాదు మొర్రో అంటున్నా ట్రంప్ మాత్రం పాత పాటే పాడుతున్నారు. అయితే .. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. తనకు ఆ అవార్డు దక్కే అవకాశం లేదేమోనని విచారపడుతున్నారు కూడా..
భారత్- పాక్ (India-Pakistan)ల మధ్య తానే యుద్ధం ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ పాతపాటే పాడారు. తాను ఇలా ఎన్ని దేశాల మధ్య యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని ఆయన నైరాశ్యం వ్యక్తంచేశారు. నోబెల్ శాంతి బహుమతి-2026 (Nobel Peace Prize 2026)కి ట్రంప్ పేరును పాక్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన ట్రూత్ సోషల్ వేదికగా పెట్టిన ఓ పోస్టులో ట్రంప్ ఇలా పేర్కొన్నారు.
కాంగో- రువాండా మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని ఏర్పాటుచేశానని పేర్కొన్న ఆయన అందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఇది హింసాత్మక రక్తపాతానికి, పౌరుల మరణాలకు దారితీసిన ఇతర యుద్ధాల కన్నా పెద్దదని, దశాబ్దాలుగా కొనసాగుతుందన్నారు. ఇరువర్గాలు ఒప్పందపత్రాలపై సంతకం చేసేందుకు వాషింగ్టన్‌కు రానున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఇది ఆఫ్రికాకు, ప్రపంచం మొత్తానికి గొప్ప రోజుగా అభివర్ణించారు. అయితే, తాను ఇలాంటివి ఎన్ని చేసినా నోబెల్ బహుమతి లభించదన్నారు. భారత్-పాక్ (India-Pakistan)ల మధ్య లేదా సెర్బియా-కొసావో మధ్య యుద్ధాలను ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదని అసహనం వ్యక్తంచేశారు.
ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి పాక్ (Pakistan) ప్రతిపాదించింది. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అందులో భారత్‌పై నోరుపారేసుకుంది. భారత్- ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. తమపై దాడికి పాల్పడి ప్రాణ నష్టానికి కారణమైందని ఆరోపించింది. కాగా.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ట్రంప్ వ్యూహాత్మక దూరదృష్టితో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారని పేర్కొంది. నిజమైన శాంతి నిర్మాతగా ఆయనపై ప్రశంసలు కురిపించింది. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ (Asim Munir) ట్రంప్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా.. పాక్ నోబెల్ శాంతి ప్రతిపాదనను వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ధ్రువీకరించారు. నోబెల్ శాంతి బహుమతిని ప్రతిపాదించిన తర్వాతే మునీర్‌కు ట్రంప్ విందు ఇచ్చారని తెలిపారు. అణుఘర్షణను నివారించిన ట్రంప్‌నకు అందుకుతగ్గ ఘనత దక్కిందని అభిప్రాయపడ్డారు.