Pakistan : భారత్- అమెరికా సంయుక్త ప్రకటనపై పాక్ గగ్గోలు
సీమాంతర ఉగ్రవాదంపై భారత్-అమెరికా సంయుక్త ప్రకటన ఏకపక్షమంటూ దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) గగ్గోలు పెట్టడం మొదలు పెట్టింది. ట్రంప్(Trump ) –మోదీ (Modi) విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో సీమాంతర ఉగ్రవాదానికి తన భూభాగం వాడుకోకుండా పాక్ చూసుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో పొరుగు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశీ వ్యవహారా శాఖ (Ministry of Foreign Affairs) స్పందిస్తూ.. ఇది పూర్తిగా ఏక పక్షంగా ఉందని ఆరోపించింది. తప్పుదోవ పట్టించేది. దౌత్య నిబంధనలకు విరుద్ధం. పాక్ త్యాగాలను లెక్కలోకి తీసుకోకుండానే దీనిలో చేర్చారు. ఇలాంటివి భారత ప్రయోజిత సీమాంతర ఉగ్రవాదాన్ని ఏమాత్రం కప్పిపుచ్చలేవు అని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. అదే సమయంలో రక్షణ పరంగా భారత్ (India) కు సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాల సరఫరాపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రాంతీయ రక్షణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.






