Pakistan: పాకిస్తాన్ రెండో ఫీల్డ్ మార్షల్ గా అసిమ్ మునీర్.. రుణం తీర్చుకున్న ప్రధాని షెహబాజ్..

పాకిస్థాన్ (Palistan) ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్కు ఆ దేశ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. పాక్ అత్యున్నత సైనిక హోదా అయిన ఫీల్డ్ మార్షల్ హోదాను కల్పిస్తూ ప్రధాని షెహబాజ్(shehbaz sharif)నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. షెహబాజ్ షరీఫ్ సర్కారు మునీర్కు ప్రమోషన్ ఇవ్వడానికి కారణాలు ఏంటి? ఆర్మీ చీఫ్ రుణం తీర్చుకోవడానికే ఈ సత్కారమా? ప్రాంతీయ అభిమానమా? పహల్గాం ఉగ్రదాడి తర్వాత తలెత్తిన ఉద్రిక్తల వేళ భారత సైన్యం చేతిలో పాకిస్థాన్ చావుదెబ్బ తిన్నది. భారత్ సైన్యం ధాటికి చేతులెత్తిసిన జనరల్ మునీర్‌కు షెహబాజ్ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టడంలో మతలబు ఏంటి?
పాకిస్థాన్ చరిత్రలో ఫీల్డ్ మార్షల్ అయిన రెండో ఆర్మీ జనరల్గా మునీర్ రికార్డు సృష్టించారు. మొదటిసారిగా ఆయూబ్ ఖాన్ 1959- 1967 మధ్య కాలంలో ఫీల్డ్ మార్షల్ పనిచేశారు. ఆయూబ్ ఖాన్ తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వాలు ఎవరికీ ఆ హోదాను కట్టబెట్టలేదు. అంతటి కీలకమైన పదవిని మునీర్కు ఇవ్వడానికి రాజకీయ, భౌగోళిక కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఎన్నికల్లో సాయం!
పాకిస్థాన్లో ఆర్మీ చాలా పవర్ ఫుల్. తను ప్రధాని కావడానికి షెహబాజ్ షరీఫ్ మునీర్ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది పాకిస్థాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షెహబాజ్ షరీఫ్కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్(PML)- నవాజ్ పార్టీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో ముస్లిం లీగ్- నవాజ్ పార్టీ విజయం సాధించడానికి ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సాయం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి.
దీనికి తోడు… షెహబాజ్ షరీఫ్కు ప్రధాన ప్రత్యర్థి అయిన ఇమ్రాన్ ఖాన్(Imran khan)ను జైలు నుంచి బయటకు రాకుండా చేయడంలో మునీర్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తన ఎన్నికకు సహకరించిన మునీర్ రుణం తీర్చుకునేందుకు షెహబాజ్ ఈ అత్యున్నత హోదా ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పంజాబీ దోస్తానా!
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పంజాబ్ ప్రావిన్స్కు చెందిన వారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఈ పాచిక పారినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ అభిమానంతో ఒకరికొకరు సహకరించుకున్నట్లు సమాచారం.. పాకిస్థాన్ ప్రభుత్వ రంగంలో ఆధిపత్యాన్ని చలాయించే వారంతా పంజాబ్ ప్రావిన్స్కు చెందిన వారే ఉంటారు. కీలక పదవుల్లో వారే ఉంటారు. కీలక పదవుల్లో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు కూడా తమ ప్రాంతానికి చెందిన వారినే ప్రోత్సహిస్తుంటారు. దీంతో ఒకే ప్రాంతం ఆధిపత్యంపై పాక్లోని ఇతర ప్రాంతాల ప్రజలు చాలాసార్లు తిరుగుబాటు చేశారు. అయితే అక్కడి ప్రభుత్వ వ్యవస్థలో మార్పు రాలేదు. మునీర్కు అత్యున్నత హోదా ఇవ్వడం వల్ల పంజాబ్ ప్రావీన్స్ ఆధిపత్యం మరోసారి బయపడింది.
విమర్శల పాలైనా అండగా ప్రభుత్వం
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత ఆర్మీ పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఆ తర్వాత రెచ్చగొట్టిన పాకిస్థాన్ సైన్యంపై విజయనాథం చేసింది. దీంతో డిఫెన్స్ పరంగా ఆ దేశానికి భారీ నష్టం జరిగింది. అయితే భారత్ చేసిన దాడులను ఆపడంలో విఫలమైన అసిమ్ మునీర్ను ఆ దేశంలోని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఆ దేశ ప్రజలు మునీర్కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ఆర్మీ చీఫ్ పదవి నుంచి అతన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ఆర్మీ చీఫ్కు ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వడంపై ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ పదవిని ఇవ్వడం ద్వారా పాకిస్థాన్ ప్రభుత్వం మునీర్కు అండగా ఉంటుందన్న సంకేతాలను కూడా షెహబాజ్ షరీఫ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.