Miss World: ప్రపంచ సుందరి సుచాత ఓపల్…

థాయ్ అందానికి ప్రపంచం దాసోహమైంది. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయ్ సుందరి ఓపల్ సుచాత (Opal Suchata) సొంతం చేసుకుంది. మొదటి రన్నరప్‌గా ఇథియోపియా భామ హాసెట్ డెరెజే, రెండో రన్నరప్‌గా మిస్ పోలండ్ మయా క్లైడా, మూడో రన్నరప్‌గా మార్టినిక్ భామ ఆరేలి జోచిమ్ నిలిచారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో విజేతలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా మోర్లే ప్రకటించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం ఉత్కంఠభరితంగా ఫైనల్స్ జరిగాయి.
ప్రపంచ సుందరిగా గెలిచిన థాయ్‌లాండ్ (Thailand) భామ ఓపల్ సుచాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా కిరీటాన్ని అలంకరించారు. సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ అందనుంది. 21 ఏళ్ల సుచాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టూడెంట్, మోడల్. 2024 మిస్ యూనివర్స్.. థాయ్‌లాండ్ పోటీల్లో మూడో రన్నరప్‌గా నిలిచిన ఆమెకు త్రుటిలో కిరీటం చేజారింది. ఈసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. థాయ్‌లాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి భామగా నిలిచారు. భారత్ తరఫున పోటీల్లో పాల్గొన్న నందిని గుప్తాకు నిరాశే ఎదురైంది. టాప్-20కి ఆమె పరిమితమైంది.
హైదరాబాద్ వేదికగా మూడు వారాలపాటు జరిగిన మిస్‌వరల్డ్ పోటీలు విజయవంతమయ్యాయి. రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగిన ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. శనివారం నాటి ఫైనల్ పోటీలు అన్నిదేశాల సుందరీమణుల పరిచయం, ర్యాంప్‌వాక్‌తో ప్రారంభమయ్యాయి. డిజైనర్ అర్చనా కొచ్చర్ డిజైన్ చేసిన తెలంగాణ, భారతీయ సంప్రదాయ పట్టు వస్త్రాలతో ముద్దుగుమ్మలు మరింత మెరుస్తూ సభికులకు అభివాదం చేశారు. ఆ తర్వాత టాప్ 40లోకి అర్హత సాధించిన దేశాలను ఖండాల వారీగా వేదికపై ఆహ్వానించారు. అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానాలో ఒక్కో ఖండం నుంచి పది మందికి చోటు కల్పించారు. తర్వాత టాప్ 20, టాప్ 8ను ఎంపిక చేశారు. మిస్ వరల్డ్‌గా గెలిస్తే ఏం చేస్తారనే ఉమ్మడి ప్రశ్నను వీరిని అడిగారు. 45 సెకన్లలో అత్యుత్తమంగా సమాధానం చెప్పిన నలుగురిని ఆయా ఖండాల విజేతలుగా ఎంపిక చేశారు. వీరిలో ప్రపంచ సుందరిని తేల్చేందుకు న్యాయనిర్ణేతలు ప్రశ్నలు అడిగారు. ఇచ్చిన సమాధానాల ఆధారంగా మిస్ వరల్డ్ 2025గా థాయ్‌లాండ్ భామను ప్రకటించారు.
న్యాయ నిర్ణేతలు వీరే
పోటీలకు నటులు సోనూసూద్, రానా దగ్గుబాటి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ సుధారెడ్డి, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్, మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్, మాజీ మిస్ ఇంగ్లాండ్ కెరినా టిర్రెల్, 72వ మిస్‌వరల్డ్ అఫిషియల్ స్టేజ్ డైరెక్టర్ డోనా వాల్ష్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జ్యూరీ ఛైర్‌పర్సన్‌గా జూలియా మోర్లే ఉన్నారు. 2016 మిస్‌వరల్డ్ స్టెఫాని డెల్, ప్రజెంటర్ సచిన్ కుంభార్ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ నృత్య ప్రదర్శనలతో అలరించారు. నాటు నాటు తెలుగు పాటకు స్టెప్పులతో ఆడిటోరియం దద్దరిల్లింది. మిస్ ఇండియా నందిని గుప్తాతో సహా మిగతా పోటీదారులు వారి స్థానాల్లోనే పాటకు తగ్గట్టుగా నృత్యాలు చేస్తూ అలరించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులతోపాటు, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దంపతులు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు, ఇతర సినీ ప్రముఖులు, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, సీఎం రమేశ్, నటి కుష్బూ, నటుడు మహేశ్‌బాబు కుమార్తె ఘట్టమనేని సితార, తదితరులు పాల్గొన్నారు.