Nethanyahu: ఇజ్రాయెల్ సమరోత్సాహం.. అమెరికా గ్రీన్ సిగ్నల్ కోసం లేచి చూడలేమన్న నెతన్యాహు..

ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య యుద్ధం భీకరస్థాయిలో కొనసాగుతోంది. ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ విమానాలతో బాంబింగ్ చేస్తుంటే.. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు దిగుతోంది. దీంతో ఇరువైపులా ప్రాణ,ఆస్తినష్టం సంభవిస్తోంది. ఈక్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేమన్నారు.
ఇరాన్‌లో అణుకేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందని నెతన్యాహు స్పష్టం చేశారు. ఫోర్డ్‌లోని భూగర్భ అణుకేంద్రంతో సహా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేయనున్నట్లు తెలిపారు. అయితే, ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేవరకు వేచి ఉండబోమని స్పష్టంచేశారు. ఇప్పటివరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యూఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదన్నారు. ఈసందర్భంగా ఇరాన్‌లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం తమకు లేదని, అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయమన్నారు. ఇరాన్‌పై దాడిలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చేరాలనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా ఆయన నిర్ణయమేనన్నారు. తాను ఇజ్రాయెల్‌కు ఏది మంచిదో అదే చేస్తానని, అలాగే ట్రంప్ కూడా అమెరికాకు మంచి జరిగే నిర్ణయాలే తీసుకుంటారన్నారు.
ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈక్రమంలో అమెరికా కూడా ఇందులో చేరేందుకు సిద్ధమైనట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో పశ్చిమాసియాలోని పరిస్థితులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దీనిపై వైట్‌హౌస్ స్పందిస్తూ.. ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే విషయంలో ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ఇరాన్‌తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా, లేవా అనే అంశాన్ని బట్టి ట్రంప్ నిర్ణయం ఉంటుందని పేర్కొంది.