Myanmar Earthquake: మయన్మార్ భూకంప మృతుల్లో భారతీయులు లేరు: కేంద్ర ప్రభుత్వం
మయన్మార్‌లో వచ్చిన భూకంపం (Myanmar Earthquake) తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు మృతుల సంఖ్య వెయ్యి దాటిందని మయన్మార్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గాయపడిన వారి సంఖ్య 2,000కు పైగా ఉన్నట్లు తెలిపింది. అయితే, మృతుల్లో భారతీయులు ఎవరూ లేరని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. బాధితులకు అండగా నిలిచేందుకు అత్యవసర సామగ్రిని, సహాయక సిబ్బందిని పంపిస్తున్నట్లు తెలిపింది.
‘‘భూకంప సమాచారం తెలియగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. మయన్మార్ (Myanmar Earthquake) ప్రజలకు భారత్ అన్నివిధాలా తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఉదయం సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హిలాయింగ్తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో భాగంగా ‘ఆపరేషన్ బ్రహ్మ’ (Operation Brahma) ప్రారంభించాం. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బందిని భారత వాయుసేన ప్రత్యేక విమానాల్లో మయన్మార్‌కు పంపిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.
‘భారత నౌకాదళం కూడా సహాయక చర్యలకు సిద్ధమవుతోంది. ఐఎన్ఎస్ సావిత్రి, ఐఎన్ఎస్ సాత్పుర నౌకలు ఇప్పటికే బయలుదేరాయి. భూకంపం (Myanmar Earthquake) కారణంగా భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు నాలుగు రెస్క్యూ శునకాలను రంగంలోకి దింపారు. అదనంగా, ఆగ్రా నుంచి 118 మందితో కూడిన వైద్య బృందం మయన్మార్ చేరుకోనుంది. అక్కడ తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసి చికిత్స అందించనుంది’ అని ఆయన వెల్లడించారు.






