Earth Quake Effect: భూకంపంతో మయన్మార్ విలవిల…
మయన్మార్‌లో భూకంప (Earthquake) విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోగా.. వారిని రక్షించేందుకు పెద్దఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం వచ్చి రెండు రోజులు గడుస్తున్న నేపథ్యంలో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి పరిస్థితిపై ఆందోళన కొనసాగుతోంది. తమవారు సజీవంగా ఉండొచ్చనే ఆశతో అనేకమంది తమ చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా అనేక ప్రాంతాలకు సహాయక బృందాలు చేరలేదని సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా. మరోవైపు.. మృతదేహాల దుర్గంధం మొత్తం వ్యాపిస్తున్నట్లు సమాచారం.
చేతులతోనే గాలింపు..
మయన్మార్(mayanmar)లో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం అనేక నగరాలపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా మాండలేలో భారీ భవనాలు, ఆధ్యాత్మిక, పర్యటక ప్రదేశాలతోపాటు అనేక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కూలిపోవడం, రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో భారీ పరికరాలు లేకుండానే రంగంలోకి దిగిన స్థానికులు.. ఉత్త చేతులతోనే శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వీధుల్లోనే నిద్ర..
రెండు రోజులుగా వరుస భూ ప్రకంపనలు మయన్మార్వాసులను హడలెత్తిస్తున్నాయి. వరుస ప్రకంపనల కారణంగా దెబ్బతిన్న ఇళ్లు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందనే భయాలు స్థానికుల్లో నెలకొన్నాయి. దీంతో 15 లక్షల జనాభా ఉన్న మాండలేలో చాలావరకు ప్రజలు రాత్రి వేళల్లో వీధుల్లోనే నిద్రపోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 5.1 తీవ్రతతో మరోసారి భూకంపం రావడంతో స్థానికులు కలవరపాటుకు గురయ్యారు.
థాయ్‌లాండ్(Thailand)లో 33 అంతస్తుల నిర్మాణ భవనం కుప్పకూలింది.. అందులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే, వారు బతికుండే అవకాశాలు చాలా తక్కువని బ్యాంకాక్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు బయటకు తీసిన వారిలో ఎవరూ ప్రాణాలతో లేరన్నారు. శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందన్నారు. ఇప్పటివరకు థాయ్‌లాండ్‌లో 17 మంది మరణించగా.. 32 మంది గాయాలపాలయ్యారు. అయితే, భారీ అంతస్తు కుప్పకూలిన ఘటనకు సంబంధించి అక్కడ పనిచేస్తున్న 83 మంది ఆచూకీ తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.






