Ocean optical cables: సముద్ర గర్భంలో మెటా కేబుల్.. ఐదు ఖండాలకు అనుసంధానం..
సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా(Meta).. ఓ భగీరథ ప్రయత్నం చేస్తోంది. తనకున్న టెక్నాలజీ, ఆర్థిక బలంతో ఓ పెద్ద నెట్ వర్క్ సృష్టిస్తోంది. అది కూడా సముద్రగర్భంలో కేబుల్స్ వేస్తోంది.ప్రపంచంలోని 5 ప్రధాన ఖండాలను కలిపే ఈ కేబుల్ పొడవు 50,000 కి.మీ.కు పైగా విస్తరించి ఉంటుంది. ఇది భూమి చుట్టుకొలత (40,075 కి.మీ) కంటే ఎక్కువ. ఈ కేబుల్‌కు నౌకల లంగర్లు, ఇతర ప్రమాదాల వల్ల ఇబ్బంది లేకుండా అధునాతన సాంకేతికత వినియోగించి 7,000 మీటర్ల వరకు లోతులో బలంగా వేస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ కేబుల్ అయిన ‘ప్రాజెక్ట్ వాటర్వర్త్’ కు భారత్‌నూ అనుసంధానం చేయనున్నామని సామాజిక మాధ్యమం మెటా తెలిపింది. మెటా ఆధ్వర్యంలో సాగుతున్న ఈ కేబుల్ ద్వారా కార్యకలాపాలు, ఈ దశాబ్దం చివరకు ప్రారంభమవుతాయని అంచనాలున్నాయి..దీనికి గానూ పది బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ(Modi) అమెరికా పర్యటన సందర్భంగా విడుదల చేసిన అమెరికా-ఇండియా సంయుక్త నేతల ప్రకటనలో ఈ ప్రాజెక్టూ ఒక భాగమే. అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లో మెటా పెట్టుబడులు కొనసాగుతున్నాయని మెటా ప్రతినిధి వివరించారు. భారత్‌లో డిజిటల్ సేవలకు గిరాకీ పెరుగుతోందని, మెటా పెట్టుబడుల ద్వారా ఈ లక్ష్యాలకు చేయూతనివ్వగలమని పేర్కొన్నారు.
ఇంటర్నెట్కు కీలకం:
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సామర్థ్యంతో, మెరుగైన సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్న ఈ సముద్రగర్భ కేబుల్‌తో భారత్, అమెరికా, ఇతర ప్రాంతాలను అనుసంధానిస్తామని మెటా ప్రతినిధి తెలిపారు. ఇంటర్నెట్ కార్యకలాపాలకు సముద్రగర్భ కేబుళ్లు కీలకం. దేశాలు పరస్పరం ఈ కేబుళ్లతోనే అనుసంధానమవుతాయి. స్థానిక టెలికాం ఆపరేటర్లు ఈ కేబుళ్లకు అనుసంధానం కావడం ద్వారా తమ వినియోగదార్లకు ఇంటర్నెట్ను అందిస్తుంటాయి.






