Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరి ఖాయమా..?

కేరళలోని (Kerala) పాలక్కాడ్ జిల్లాకు (palakkad district) చెందిన 37 ఏళ్ల నర్సు నిమిష ప్రియ (nimisha priya) యెమెన్‌లో (yemen) ఉరిశిక్షను ఎదుర్కొంటోంది. 2017లో యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహ్దీ హత్య కేసులో ఆమెను దోషిగా నిర్ధారించిన యెమెన్ కోర్టు 2020లో మరణశిక్ష విధించింది. ఈ శిక్షను యెమెన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ 2023లో సమర్థించింది. ఈ నెల 16న ఆమె ఉరిశిక్ష అమలు కానుంది. ఎలాగైనా ఉరి శిక్షను ఆపాలని ఆమె కుటుంబసభ్యులు భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే యెమెన్ లో అంతర్గత సంక్షోభం దృష్య్టా దీనిపై చర్యలు జరిపేందుకు భారత ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో నిమిష ప్రియ ఉరిశిక్షపై ఉత్కంఠ కొనసాగుతోంది.
నిమిష ప్రియ 2008లో తన కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి యెమెన్‌కు వలస వెళ్లింది. కేరళలోని కొల్లెంగోడ్‌లో పేద కుటుంబంలో జన్మించిన ఆమె, నర్సింగ్ కోర్సు పూర్తి చేసి సనా నగరంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. 2011లో ఆమె తిరిగి కేరళకు వచ్చి టోమీ థామస్‌ను వివాహం చేసుకుంది. వారిద్దరూ యెమెన్‌కు తిరిగి వెళ్లారు. అక్కడ ఆమె తన సొంత క్లినిక్‌ను ప్రారంభించాలని కలలు కన్నారు. యెమెన్ చట్టం ప్రకారం, విదేశీయులు వ్యాపారం ప్రారంభించాలంటే స్థానిక భాగస్వామి అవసరం. ఈ క్రమంలో నిమిష, తలాల్ అబ్దో మహ్దీ అనే స్థానికుడితో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
2015లో నిమిష, మహ్దీతో కలిసి క్లినిక్ ప్రారంభించింది. అయితే.. మహ్దీ ఆమె నుండి డబ్బు కాజేయడం, ఆమె పాస్‌పోర్ట్ ను తనదగ్గర పెట్టుకోవడం, లైంగికంగా వేధించడం లాంటివి చేశాడనే ఆరోపణలున్నాయి. అతడి బాధలు భరించలేక ఎలాగైనా పాస్ పోర్టు తీసుకుని పారిపోవాలనే ఆలోచనతో 2017లో నిమిష ప్రియ, మహ్దీకి సెడేటివ్ ఇంజెక్షన్ ఇచ్చింది. అయితే అతిగా ఇచ్చిన డోస్ కారణంగా మహ్దీ మరణించాడు. భయాందోళనతో నిమిష ప్రియ మరో నర్సు హనాన్ సహాయంతో మహ్దీ శవాన్ని ముక్కలుగా కోసి నీటి ట్యాంక్‌లో పడేసింది. ఆమె యెమెన్ నుంచి పారిపోయే ప్రయత్నంలో అరెస్టయింది. 2018లో ఆమె హత్య కేసులో దోషిగా నిర్ధారించబడింది. 2020లో ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది.
యెమెన్‌లో షరియా చట్టం ప్రకారం, బాధిత కుటుంబం “బ్లడ్ మనీ” (దియా) స్వీకరించి క్షమాపణ అందించినట్లయితే ఉరిశిక్షను రద్దు చేయవచ్చు. నిమిష కుటుంబం, “సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ ఆక్షన్ కౌన్సిల్” మహ్దీ కుటుంబానికి 10 లక్షల డాలర్లు (సుమారు 8.3 కోట్ల రూపాయలు) ఆఫర్ చేశారు. అదనంగా, బాధిత కుటుంబ సభ్యుడి వైద్య చికిత్స కోసం ఉచిత సేవలు, రాకపోకల ఖర్చులను భరించే ప్రతిపాదన కూడా చేశారు. అయితే, ఈ ఆఫర్‌ను మహ్దీ కుటుంబం ఇంకా స్వీకరించలేదు. నిమిష తల్లి ప్రేమ కుమారి 2024 ఏప్రిల్ నుంచి యెమెన్‌లోనే ఉంటూ, క్షమాపణ కోసం ప్రయత్నిస్తోంది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నిమిష కేసును నిశితంగా పరిశీలిస్తోంది. “నిమిష ప్రియ కేసు గురించి తెలుసు. ఆమె కుటుంబం సంబంధిత ఆప్షన్‌లను పరిశీలిస్తోంది. ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తోంది” అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టులో దీనిపై కేసు దాఖలైంది. జులై 14న దీనిపై విచారణ జరగనుంది. ఈలోపు భారత ప్రభుత్వం దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారా జోక్యం చేసుకోవాలని కోరింది. యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న సనా ప్రాంతంలో భారతదేశానికి అధికారిక దౌత్య ప్రాతినిధ్యం లేదు. దీంతో దౌత్యపరమైన ప్రయత్నాలకు ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో ఇరాన్ (iran) జోక్యంతో ఈ సమస్యను పరిష్కరించాలని భారత్ ప్రయత్నిస్తోంది.
ఇప్పుడు నిమిష ప్రియ ఉరిశిక్ష అమలు అనేది మహ్దీ కుటుంబం క్షమాపణపై ఆధారపడి ఉంది. బ్లడ్ మనీ చెల్లింపు కోసం చర్చలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఒప్పందం కుదరలేదు. భారత ప్రభుత్వం ఇరాన్ సహాయంతో, దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అయితే, సమయం దగ్గర పడుతోంది. జులై 16 సమీపిస్తున్నందున ఒత్తిడి పెరుగుతోంది. నిమిష తల్లి, కుటుంబం, సమాజం ఆమె ప్రాణాలను కాపాడాలని ఎదురు చూస్తోంది. నిమిష ప్రియ కేసు కేరళ నుండి వలస వెళ్లిన కార్మికుల దీనస్థితిని, విదేశాల్లో చట్టపరమైన సవాళ్లను తెలియజేస్తోంది.