Ayatollah Ali Khamenei : తమ దేశంపై దాడి చేస్తే అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాం
ఇరాన్, అమెరికా మధ్య మాటల యుద్దం జరుగుతోంది. టెహ్రాన్ తన అణుకార్యక్రమంపై ఓ ఒప్పందం కుదుర్చుకోవాలని అందుకు చర్చలు జరపాలని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేని (Ayatollah Ali Khamenei) కి అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే నేరుగా అగ్రరాజ్యంతో చర్చలు జరిపేందుకు సిద్దంగా లేమని ఇరాన్ (Iran) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ట్రంప్ మాట్లాడుతూ అణు కార్యక్రమంపై చర్చలకు ఇరాన్ అంగీకరించకపోతే ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. దీనిపై ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు.
తమ దేశంపై దాడికి అమెరికా (America) ప్రయత్నిస్తే ఎదురుదాడి తప్పదని స్పష్టం చేశారు. అగ్రరాజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు. మాపై ఇజ్రాయెల్, అమెరికాలకు ద్వేషం ఎప్పుడూ ఉంది. మాపై దాడి చేస్తేమని బెదిరిస్తారు. అయితే వారు చేస్తారని అనుకోవడం లేదు. ఒక వేళ అలాంటి దుస్సాహసానికి ఒడిగడితే మాపైపు నుంచి తీవ్రస్థాయిలో స్పందన ఉంటుంది. వారిని తీవ్రంగా దెబ్బతీస్తాం. అలా కాకుండా గతంలోనూ మా దేశం లోపల చిచ్చు రేపాలని ప్రయత్నిస్తే, ఆ విషయాన్ని ఇరాన్ ప్రజలే చూసుకుంటారు అని ఖమేనీ తెలిపారు.






