Russian OIl: రష్యాకు చైనా కరెన్సీలో భారత్ చెల్లింపులు!

రష్యా నుంచి భారత్ చేస్తున్న చమురు కొనుగోళ్లలో (Russian Oil) కొంత భాగానికి చైనా కరెన్సీ యువాన్‌లో (China Yuan) భారత్ చెల్లిస్తోందని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ వెల్లడించారు. అయితే యువాన్‌లో జరుగుతున్న లావాదేవీల చాలా తక్కువని, ఎక్కువశాతం రష్యా కరెన్సీ రూబుల్స్‌లోనే జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన తర్వాత.. పాశ్చాత్య దేశాలు మాస్కోపై భారీగా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో రూబుల్, యువాన్, యూఏఈ కరెన్సీ దిర్హమ్ వంటి ప్రత్యామ్నాయ కరెన్సీల ద్వారా అంతర్జాతీయ లావాదేవీలు చేయడం రష్యాకు తప్పనిసరి అయింది.
ప్రస్తుతం రష్యా నుంచి చమురు (Russian Oil) కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు భారీగా పెరిగాయి. అదే సమయంలో రష్యాపై అంతర్జాతీయంగా తీవ్రమైన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో డాలర్‌పై ఆధారపడటాన్ని రష్యా తగ్గించుకోవాల్సి వచ్చింది. అందుకే చైనా యువాన్‌లో (China Yuan) చెల్లింపులను కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.