Maldives: నాడు ఇండియా ఔట్.. నేడు కొండంత అండ… మాల్దీవుల గొంతులో కొత్త రాగం..

మాల్దీవులు.. ఇండియా (India)కు అత్యంత సమీపంలో ఉన్న చిన్న ద్వీరం. పూర్తిగా పర్యాటకం, ఫిష్షింగ్ పై ఆధారపడిన ఈ బుల్లి దేశం.. భారత్ కు చిన్న తమ్ముడు లాంటిది. అందుకే ఎలాంటి అవసరమైనా.. ఏ సమస్య ఉన్నా,… వెంటనే ఆదుకుని అక్కున చేర్చుకోవడం భారత్ ఎప్పుడూ చేస్తుంటుంది. అంతేకాదు.. ఆదేశం ఆర్థికంగా డౌన్ కాకుండా రుణసదుపాయం కల్పించి, ముందుండి నడిపిస్తుంటుంది. అలాంటిది కొత్త అధ్యక్షుడు ముయిజ్జు.. భారత్ వ్యతిరేక గళంతో అధికారాన్ని సాధించాడు. ఆతర్వాత తాను అనుకున్నది దేశప్రజలకు చేసి చూపించాలని భావించాడు.
ముందుగా ఇండియాకు ధిక్కార స్వరం వినిపించాడు. భారత్ దళాలు వెళ్లిపోవాలని హుంకరించాడు. అంతేనా ఇండియాకు ఆది నుంచి ప్రత్యర్థిగా ఉన్నచైనాకు మోకరిల్లాడు. ఆదేశంలోకి వెళ్లి తమతో వ్యాపార బంధాన్ని పెంచుకోవాలని అభ్యర్థించాడు. దీంతో భారతీయులు… క్విట్ మాల్దీవులు అంటూ ట్రెండ్ చేశారు. ఫలితంగా ఆ దేశ పర్యాటకం తీవ్రంగా దెబ్బతింది. బుక్ చేసుకున్న ఇండియన్స్ కూడా .. నెమ్మదిగా రద్దుచేసుకోవడం ప్రారంభించారు. ఫలితంగా పర్యాటకంపై ఆధారపడిన మాల్దీవులకు ఇబ్బందులు తప్పలేదు.
అయితే .. చైనా ఎప్పుడు డిఫరెంట్ గా ఆలోచిస్తుంది. వీరితో స్నేహం చేస్తే మనకేంటి లాభం అన్నదే ఆదేశ అజెండా..ముయిజ్జు ఎంత ప్రాధేయపడినా.. వారు మాత్రం మమ అనిపించారు. ఇక వేరే మార్గం లేదు. భారత్ కూడా గతంలో ఇచ్చిన అప్పు గుర్తు చేసింది. దీంతో ముయిజ్జుకు తత్వం బోధపడింది. ఇక మోడీతో చెలిమికి ముందుకొచ్చారు. చేయిచాయి వెంట నడుస్తామన్నారు.. ఈ విషయంలో భారత్ కు కాస్త స్వార్థ ప్రయోజనం ఉంది. ఎందుకంటే తీరప్రాంత దేశం.. ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్తే .. భారత్ భద్రతపై ప్రమాదం. అందుకే.. మిత్రమా అనగానే.. అక్కున చేర్చుకుంది. ఇప్పుడు ఏకంగా మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవానికి మోడీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఇండియా ఔట్’ విధానాన్ని అనుసరించి నాడు భారత్‌తో ఘర్షణ పడిన మాల్దీవులు ఇప్పుడు న్యూదిల్లీతో స్నేహబంధాన్ని పునరుద్ధరించుకునేందుకు ఆరాటపడుతోంది. భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని, మిత్ర దేశమని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) కొనియాడారు. ఆ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీ (PM Modi)తో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘సుదీర్ఘకాలంగా మాల్దీవులకు భారత్ సన్నిహిత, విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోంది. భద్రత, వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి విస్తృత రంగాల్లో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోంది. ఎలాంటి విపత్తులు, సంక్షోభాల సమయంలోనైనా మా ద్వీప దేశానికి భారత్ అండగా నిలిచింది. వేగంగా స్పందించి ఆపన్నహస్తాన్ని అందించింది’’ అని ముయిజ్జు ప్రశంసించారు.