New Delhi: ఫ్రాన్స్ తో రఫేల్ డీల్ .. ఇక ఇండియన్ నావీ సింహస్వప్నమే…

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంటోంది. మేకిన్ ఇండియాతో ఓవైపు దేశంలోనే ఉత్పత్తుల తయారీ చేపడుతూనే..ప్రపంచంలో పేరెన్నిక గన్న ఆయుధ వ్యవస్థల్ని సమకూర్చుకుంటోంది. ఎందుకంటే.. పహల్గాం(pahalgam) దాడి తర్వాత భారత ఆలోచనా సరళి మారింది. దీంతో నావీ బలాన్ని పెంచుకునేలా ఫ్రాన్స్ తో అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్స్ డీల్ కుదుర్చుకుంది. ఇవి 2031 నాటికి భారత్ నావీలో చేరనున్నాయి.
భారత నౌకాదళం చేతికి అత్యాధునిక యుద్ధ విమానాలు అందనున్నాయి. 26 రఫేల్ ఎం (marine) శ్రేణి విమానాలు కొనుగోలు చేసేందుకు వీలుగా భారత్ ..ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ మేరకు సంతకాలు జరిగాయి. డీల్ విలువ రూ.63 వేల కోట్లు. ఇది పూర్తిగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం. వీటిల్లో 22 సింగిల్ సీటర్ జెట్లు కాగా.. నాలుగు ట్విన్ సీటర్ ట్రైనర్లు.
ప్రపంచంలో నౌకాదళాలు వినియోగించే అత్యాధునిక ఫైటర్ జట్లలో ఒకటిగా రఫేల్ ఎంను పరిగణిస్తారు. దీనిలో శాఫ్రన్ గ్రూప్ తయారు చేసిన ప్రత్యేకమైన రీఎన్‌ఫోర్స్‌డ్ ల్యాండింగ్ గేర్స్ వాడారు. ఇది విమానవాహక నౌకలపై దిగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విమానాల రెక్కలను మడతపెట్టే సౌకర్యం కూడా ఉంది. ఈ విమానాలు ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై భారత్ మోహరించనుంది. ప్రస్తుతం వాడుతున్న మిగ్ 29ల స్థానాలను ఇవి భర్తీ చేయనున్నాయి.
ప్రస్తుతం భారత వాయుసేన మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. తాజాగా నేవీ కూడా వీటిని కొనుగోలు చేయనుండటంతో రెండు దళాల మధ్య సమన్వయం పెరుగుతుంది. బడ్డీ-బడ్డీ రీఫ్యూయలింగ్‌కు అవకాశం ఉంటుంది. ఓ ఫైటర్ జెట్ రీఫ్యూయలింగ్ పాడ్ సాయంతో మరో ఫైటర్ జెట్‌లో ఇంధనం నింపడాన్ని ఇలా అంటారు. అప్పుడు భారీ ఫ్యూయల్ ట్యాంకర్ విమానాల అవసరం ఉండదు.