Racist Attack: భారతీయ సిక్కు యువతిపై లైంగిక దాడి.. యూకేలో నిందితుడు అరెస్ట్!
యూకేలో భారతీయ సిక్కు యువతిపై లైంగిక దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జాతి విద్వేషంతోనే (Racist Attack) ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్న ఈ ఘటనలో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేశారు. నార్త్ ఇంగ్లండ్‌లోని వాల్సాల్కు చెందిన 32 ఏళ్ల తెల్లజాతీయుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతన్ని గుర్తించామని, నిందితుడు వాల్సాల్లో ఉండగా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నెల రోజుల క్రితం వాల్సాల్కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓల్డ్‌బరీ (Oldbury) ప్రాంతంలో భారతీయ సిక్కు యువతిపై (Indian Sikh Woman) ఈ అఘాయిత్యం జరిగింది.
ఈ అరెస్టు విషయాన్ని బాధితురాలికి తెలియజేశామని, ప్రత్యేకంగా శిక్షణ పొందిన అధికారులు ఆమెకు (Indian Sikh Woman) సహకారం అందిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే మరో ఇద్దరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు, అయితే వారిని బెయిల్‌పై విడుదల చేసినట్లు సమాచారం.







