Ukraine War: ఉక్రెయిన్‌లో శాంతికి పూర్తి మద్దతు.. యూఎన్‌లో భారత్ ప్రకటన

రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతి నెలకొల్పే మార్గాలకు భారత్ (India) పూర్తిగా మద్దతిస్తుందని ఐక్యరాజ్యసమితి (United Nations)లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ (Parvathaneni Harish) ప్రకటించారు. ఉక్రెయిన్ పరిస్థితిపై భారత్ ఆందోళన చెందుతోందని, అమాయకుల ప్రాణాలు కోల్పోవడం సరికాదని ఆయన అన్నారు. సమస్యలకు పరిష్కారం యుద్ధ భూమిలో కాదని, దౌత్య మార్గాల ద్వారానే దొరుకుతుందని తాము బలంగా విశ్వసిస్తున్నామని హరీశ్ తెలిపారు. ఈ దిశగా జరుగుతున్న అన్ని ప్రయత్నాలను భారత్ స్వాగతిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలతో పాటు యూరోపియన్ నేతలతో పలుమార్లు మాట్లాడిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), పుతిన్ మధ్య అలాస్కా వేదికగా జరిగిన సమావేశాన్ని కూడా హరీశ్ స్వాగతించారు. పంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలపై భారత్ విచారం వ్యక్తం చేస్తోందన్నారు. ఇది యుద్ధాల శకం కాదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన పునరుద్ఘాటించారు. వీలైనంత త్వరగా యుద్ధం ముగియడం అందరికీ ప్రయోజనకరమని హరీశ్ (Parvathaneni Harish) పేర్కొన్నారు.