Ind vs NZ: ఆ ఇద్దరినీ కంట్రోల్ చేస్తే కప్ మనదే..!
భారత్ – న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ (CT Final) ఫైనల్ మ్యాచ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇరు జట్ల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. రెండు జట్లు ఈ మెగా టోర్నీని విజయవంతంగా ముగించేందుకు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నాయి. అయితే ఇప్పుడు భారత్ కు ఇద్దరు ఆటగాళ్ల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉండే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కెన్ విలియమ్సన్.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడుతున్న ఇన్నింగ్స్ లు కీలకంగా మారుతున్నాయి.
ఇటీవల లీగ్ మ్యాచ్ లో భారత్ పై దాదాపుగా మ్యాచ్ గెలిపించినంత పని చేశాడు విలియమ్సన్. ఇక సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు. దీనితో భారత్ తో జరిగే మ్యాచ్ లో అతన్ని కట్టడి చేయకపోతే కచ్చితంగా ఇబ్బందులే ఎదురవుతాయని అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇక మరో ఆటగాడు, ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర (Rachin Raveendra)పై కూడా అభిమానుల్లో భయాలు మొదలయ్యాయి. అతను కూడా కీలక ఇన్నింగ్స్ లాడుతూ దూకుడుగా పరుగులు చేస్తున్నాడు.
మొదటి 15 ఓవర్ల పాటు ఇన్నింగ్స్ నిలబెడుతున్న విధానం అభిమానులను కంగారు పెడుతుంది. మరో ఓపెనర్ పెద్దగా రాణించకపోయిన రవీంద్ర మాత్రం జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక భూమిక పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో రెండు సెంచరీలు చేసి ఊపు మీద ఉన్న ఈ ఆటగాడు కచ్చితంగా భారత్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే భారత బౌలింగ్ విభాగం గతంలో కంటే పటిష్టంగా కనబడుతోంది. ప్రధానంగా వరుణ్ చక్రవర్తి కీలక వికెట్లు తీస్తూ జట్టుకు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నాడు. దీనితో వీళ్లిద్దరిని వరుణ్ చక్రవర్తి డీల్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.






