భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య.. ఎక్సర్ సైజ్ శక్తి ప్రారంభం
భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణ మేఘాలయాలోని ఉమ్రోయ్లో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైందని రక్షణ శాఖ తెలిపింది. ఇరు దేశాల సైనిక పాటవాన్ని పెంపొందించుకోవడం, సైనిక పద్ధతులు, వ్యూహాలు, సాంకేతికతలను పరస్పరం పంచుకోవడం దీని ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఈ నెల 26 వరకు ఇది కొనసాగనుంది. ఉగ్రవాద చర్యకు ప్రతిస్పందనగా పలు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. ప్రారంభ కార్యక్రమానికి భారత్లో ఫ్రాన్స్ రాయబారి థియెర్రీ మథౌ, 51 సబ్ ఏరియా కమాండిరగ్ జనరల్ అధికారి మేజర్ జనరల్ ప్రసన్న సుధాకర్ జోషి పాల్గొన్నారు. 90 మంది సిబ్బందితో కూడిన భారత బృందం, 90 మంది సిబ్బందితో కూడిన ఫ్రెంచ్ బృందం ఇందులో పాల్గొంటోంది. భారత నౌకాదళం, వైమానిక దళం పరిశీలకులు కూడా దీనికి హాజరవుతున్నారు.






