foreign education: అమెరికా, కెనడా వద్దు.. యూరోపియన్ దేశాలే ముద్దంటున్న భారతీయ యువత
కెనడా ప్రధానిగా ఉన్న సమయంలో జస్టిన్ ట్రూడో(Trudeau) ఒంటెద్దుపోకడలు.. ట్రంప్ హెచ్చరికలతో భారతీయ యువత, వారి తల్లితండ్రుల్లోనూ గణనీయమైన మార్పొచ్చింది. ఎప్పుడు ఏమౌతుందో తెలియని అనిశ్చితిలో తమ బిడ్డలు చదువుకోవడమెందుకన్న ఆలోచనకు వచ్చిన అధికశాతం మంది తల్లితండ్రులు.. ఇప్పుడు తమ పిల్లల చదువుకునే దేశాలకు గానూ ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. దాని ఫలితంగా అమెరికా, కెనడా దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో గణనీయమైన క్షీణత కనిపిస్తోంది.
అమెరికా మరియు కెనడా రెండూ, అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఉత్తర అమెరికాలోని అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలుగా పేరుగాంచాయి. ముఖ్యంగా కెనడాలో చదువుకుని, అమెరికాలో గ్రీన్ కార్డు పొందొచ్చని,,, అవకాశాల స్వర్గంలో స్థిరపడొచ్చన్న ఆశతో వేలాది మంది కెనడాను తమ చదువులకు గమ్యస్థానంగా భావిస్తూ వచ్చారు. అమెరికా సైతం ఆవిధమైన విధానాన్ని కొనసాగిస్తూ వచ్చింది కూడా. అయితే ఇటీవలి కాలంలో కెనడా ప్రధాని ట్రూడో… భారత్ పై అకారణ ద్వేషాన్ని కనబర్చారు. ఖలిస్తానీల ఓట్ల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన భారత్ తో గొడవలు పెంచుకున్నారు.
ఇక దీనికి తోడు కెనడాలో భారతీయులు, హిందువులపై దాడులు పెరగడం..దాన్ని కెనడా అధికార యంత్రాంగం సైతం చూస్తూ ఉండడం.. సమస్యాత్మకంగా మారింది. ఇక్కడ నుంచి వెళ్లిపోండంటూ నేరుగా ఆలయాల దగ్గరే హిందువులపై దాడులు చేస్తున్నారు.ఈ పరిణామంపై స్థానికంగా , అంతర్జాతీయంగానూ నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు.. కెనడాలో ద్రవ్యోల్బణం పెరగడం.. ఖర్చులు తడిసిమోపెడు కావడం కూడా భారతీయులకు ఆ దేశానికి దూరంగా ఉండేందుకు కారణాలుగా మారాయి.
ఇక అమెరికా అయితే.. ట్రంప్ రాకతోనే విదేశీయులు, ముఖ్యంగా భారతీయులకు పరోక్ష హెచ్చరికలు జారీ అయ్యాయని చెప్పొచ్చు. అమెరికా ఫస్ట్ పాలసీ అన్న ట్రంప్.. విదేశీ కంపెనీలు, స్వదేశీ కంపెనీలకు.. లోకల్ యూత్ కే ప్రాధాన్యమివ్వాలని గతంలో సూచించారు కూడా. ఎప్పుడు ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నభయంతో.. అమెరికా అన్నా కూడా భారతీయులు వెనకాడే పరిస్థితి ఉంది. దీనికి తోడు కొత్తగా గ్రీన్ కార్డు(Green card) వచ్చే పరిస్థితులు ఇప్పుడప్పుడే లేవు. ఈమాత్రం దానికి అక్కడికే ఎందుకెళ్లాలి.. ఎందుకా ఇబ్బందులు పడాలన్న భావన భారతీయ విద్యార్థుల కుటుంబాల్లో వ్యక్తమవుతోంది.ట్రంప్ పరిపాలనలో కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాల ఫలితంగా USకు భారతీయ విద్యార్థుల రాక 30% తగ్గింది, కెనడా యొక్క కఠిన నిబంధనల కారణంగా 60% తగ్గుదల ఏర్పడింది. ఇతర దేశాలు ఈ క్షీణతను పెట్టుబడిగా తీసుకుంటున్నాయి. UK, ఐర్లాండ్ మరియు ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల నమోదులో పెరుగుదల కనిపించింది.అదేవిధంగా, ఫ్రాన్స్ మరియు స్వీడన్ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఈ సంవత్సరం విద్యార్థుల రాకను పెంచుతున్నాయి.






