NASA: నాసా కీలక పదవిలో భారతీయ అమెరికన్

అంతరిక్ష అన్వేషణకు అసోసియేట్ నిర్వహణాధికారిగా భారతీయ అమెరికన్ అమిత్ క్షత్రియ(Amit Kshatriya)ను నియమిస్తున్నట్లు అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) (NASA) ప్రకటించింది. సంస్థ తాత్కాలిక ప్రధాన నిర్వాహకుడు షాన్ పి.డఫీ (Shawn P. Duffy) ఈ విషయాన్ని తెలిపారు. భారత్ నుంచి అమెరికాకు వలసవచ్చిన తల్లిదండ్రులకు విస్కాన్సిన్‌లో జన్మించిన క్షత్రియ నాసా చరిత్రలో మిషన్ కంట్రోల్ ఫ్లైట్ డైరెక్టర్‌గా పనిచేసిన 100 మందిలో ఒకరు. 20 ఏళ్లుగా నాసాలో పనిచేస్తున్న క్షత్రియ ఇటీవల చంద్రుని నుంచి కుజ గ్రహానికి అన్వేషణ యాత్రా పథకానికి డిప్యూటీ డైరెక్టర్ (Deputy Director) గా పనిచేశారు. అంతరిక్ష కేంద్రానికి 50వ సారి జరిగిన యాత్రకు ప్రధాన ఫ్లైట్ డైరెక్టర్‌గా అపూర్వ సేవలు అందించినందుకు గానూ ఆయనకు నాసా విశిష్ట నాయకత్వ పతకం లభించింది. అంతరిక్ష యాత్రలను క్షేమంగా నిర్వహించినందుకు ఇచ్చే సిల్వర్ స్నూపీ అవార్డు కూడా క్షత్రియకు లభించింది. ఇకపై అసోసియేట్ నిర్వహణాధికారిగా నాసాలో అత్యున్నత సివిల్ సర్వీసు పదవిని నిర్వహిస్తారు. నాసా తాత్కాలిక నిర్వహణాధికారి డఫీకి సలహాదారుగా పనిచేస్తారు.