నీలగిరి నుంచి న్యూయార్క్‌కు ఏనుగు బొమ్మలు
భారతీయ కళాకారులు రూపొందించిన 100 ఏనుగుల విగ్రహాలు అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నాయి. మానవులు, అటవీ జంతువుల మధ్య సామరస్య సహజీవనం ప్రాముఖ్యతను తెలియజేసేలా ది గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ పేరిట మీట్‌ప్యాకింగ్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో పలు చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. ఎలిఫెంట్ ఫ్యామిలీ యూఎస్ఏ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. భారత్‌లోని నీలగిరి జీవావరణ రిజర్వు ప్రాంతంలోని కో ఎగ్జిస్టెన్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో 200 మంది కళాకారులు వీటిని తీర్చిదిద్దినట్లు ఆ సంస్థ తెలిపింది. అడవుల్లో దొరికే లాంటానా కమారా అనే కలుపు మొక్క జాతి నుంచి తయారు చేసిన పదార్థాన్ని విగ్రహాల తయారీలో వినియోగించినట్లు తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 5 లక్షల డాలర్ల నిధులను సేకరించినట్లు పేర్కొంది.






