Trump: ఇరాన్ భూగర్భ కేంద్రాన్ని ధ్వంసం చేసే సీన్ ఇజ్రాయెల్ కు లేదు.. ట్రంప్ కామెంట్స్…

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Nethanyahu)కు ట్రంప్ గట్టికౌంటరే ఇచ్చారు. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా.. సంయమనం అవసరమన్న విషయాన్ని నెతన్యాహుకు తేల్చి చెప్పారు. తమ సాయం లేకుంటే.. ఇజ్రాయెల్ ఏమీ చేయలేదన్న సంగతి అర్థమయ్యేలా విడమర్చి మరీ చెప్పారు. ఇంతకూ ట్రంప్ ఏమన్నారంటే.. తమ సాయం లేకుండా ఫోర్డ్‌లోని భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు లేదన్నారు. న్యూజెర్సీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో గణనీయమైన ప్రయోజనాలు సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, అమెరికా (USA) సాయం లేకుండా ఇరాన్‌కు చెందిన ఫోర్డ్ భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం టెల్‌అవీవ్‌కు లేదన్నారు. ఒకవేళ వారు దాడులు చేసినా అది పెద్ద ప్రభావం చూపించవన్నారు. వారికి ఆ సామర్థ్యం లేదన్నారు. ఈసందర్భంగా తాను దౌత్యానికి కట్టుబడి ఉన్నానని చెప్పిన ఆయన.. సైనిక కార్యకలాపాలను ఆపేయాలని ఇజ్రాయెల్‌ను ఒప్పించడం ప్రస్తుతానికి అసంభవమన్నారు. ఎవరైనా గెలుస్తుంటే ఇలాంటి అభ్యర్థనలు చేయడం కష్టమని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో టెల్‌అవీవ్ అద్భుతమైన దాడులు చేస్తుండగా.. టెహ్రాన్‌వి పేలవంగా ఉన్నాయన్నారు. ఇదిలాఉండగా.. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి యూరోపియన్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ తోసిపుచ్చారు. వారు సాయం చేయలేరని వ్యాఖ్యానించారు. ఇరాన్ నాయకులు యూరప్‌తో కాకుండా అమెరికాతో చర్చలు జరపాలనుకుంటున్నారని వెల్లడించారు.
శుక్రవారం నెతన్యాహు మాట్లాడుతూ.. అమెరికా గ్రీన్ సిగ్నల్ కోసం తాము వేచిచూడడం లేదన్నారు. దీంతో నెతన్యాహు వ్యాఖ్యలకు కౌంటర్ గా ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. తమకు ఇరాన్ లోని అన్ని అణ్వస్త్ర కేంద్రాలను ధ్వంసం చేసే సత్తా ఉందని అన్నారు నెతన్యాహు. అంతేకాదు.. దీనికోసం తాము అమెరికా అనుమతి కోసం వేచి చూడడం జరగదన్నారు. తమ శక్తి సామర్థ్యాలు అపారమైనవని విశ్వాసం వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.