Donald Trump: యూఎస్ఏఐడీపై ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
భారత రాజకీయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి ‘యూఎస్ఏఐడీ’ (USAID) నిధులను ఉపయోగించారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ (Congress) అర్థరహితమైన ఆరోపణలుగా పేర్కొంది.
‘‘భారతదేశంలో ఎవరికో అనుకూలంగా ఫలితాలు రావడానికి ‘యూఎస్ఏఐడీ’ నిధులను ఉపయోగించారని ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి. యూఎస్ఏఐడీ ద్వారా భారతదేశంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అందిన సహాయాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చెయ్యాలి’’ అని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత జైరాం రమేశ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇంతలో, భారతదేశంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు యూఎస్ఏఐడీ నుంచి అందిస్తున్న 21 మిలియన్ డాలర్ల నిధులను ఎలన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజె) ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై ఇటీవల మాట్లాడిన ట్రంప్ (Donald Trump).. ‘‘భారతదేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు మనం ఎందుకు 21 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలి? బహుశా ఆ దేశంలో ఎవరికో అనుకూలంగా ఫలితాలు రావడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించిందేమో? ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పకుండా తెలియజేయాలి. ఇదే కీలకమైన ముందడుగు అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.






