Singapore : ఈ నెల 26 నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన

బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సింగపూర్ (Singapore)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అవుతారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, నూతన పారిశ్రామిక పాలసీలు, భూముల లభ్యత, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, నిపుణులైన మానవవనరుల లభ్యత గురించి వారికి వివరించనున్నారు. ఆయా సంస్థల ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానిస్తారు. తొలిరోజు సింగపూర్ సహా సమీప దేశాల్లోని ప్రవాసాంధ్రులతో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశం (Telugu Diaspora Meeting ) లో చంద్రబాబు పాల్గొంటారు. పేదరిక నిర్మూలన కోసం తెచ్చిన పీ4లో భాగస్వాములవ్వాల్సిందిగా పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాసాంధ్రుల్ని కోరనున్నారు.
విశాఖపట్నంలో ఈ నవంబరులో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు విదేశీ పారిశ్రామికవేత్తల్ని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఈ మేరకు వివిధ దేశాల ప్రముఖలతో ఆయన భేటీ అవుతారు. పోర్టు అధారిత ప్రాజెక్టులు, సెమి కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుపైనా చంద్రబాబు వారితో చర్చిస్తారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్‌పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో (Business Roundtable Meeting) పాల్గొంటారు. సింగపూర్‌లో నిర్వహించే బిజినెస్ రోడ్‌షో (Business Roadshow) కు హాజరవుతారు. సింగపూర్‌లోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాల్ని సందర్శిస్తారు అని సీఎం కార్యాలయం తెలిపింది.